వైయస్ జగన్‌కు 30 నోటీసులు, వైయస్ విజయమ్మకు ఏడు నోటీసులు
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప లోకసభ అభ్యర్థి వైయస్ జగన్‌కు 39 నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. వాటిలో 9 నోటీసులకు జగన్ వివరణ ఇచ్చినట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. పులివెందుల శాసనసభా నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ విజయమ్మకు ఏడు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు లోకసభ అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డికి మూడు, తెలుగుదేశం అభ్యర్థి మైసురా రెడ్డికి నాలుగు నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. పులివెందుల శాసనసభ కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డికి రెండు నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
కడప, పులివెందుల ఉప ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 305 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 10,540 మందిపై బైండోవర్ కేసులు పెట్టినట్లు కూడా ఆయన తెలిపారు. 1240 ఆయుధ లైసెన్సులు రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. పులివెందుల, కడప ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు 2.21 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు.