బెజవాడ వివాదంతోనే సూరిని హత్య చేసిన భాను కిరణ్: చార్జిషీట్
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడలోని అన్నపూర్ణ ఇండస్ట్రీస్ వ్యవహారం ముదిరిన కారణంగానే మద్దెలచెర్వు సూరిని అతని ముఖ్య అనుచరుడు భానుకిరణ్ చంపినట్లుగా తెలుస్తోంది. అన్నపూర్ణ ఇండస్ట్రీస్ గొడవ కారణంగానే భాను సూరిని అంతమొందించినట్లు హైదరాబాదుకు చెందిన సిసిఎస్ పోలీసులు తమ ఛార్జీ షీటులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. నాంపల్లి కోర్టులో కూడా అలాగే సబ్‌మిట్ చేసినట్టుగా తెలుస్తోంది. సూరి హత్యకు ముందు అన్నపూర్ణ ఇండస్ట్రీస్ గొడవ పరిష్కారంలో ఆయన హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు బెజవాడ వెళ్లి అక్కేడ పదిహేను రోజులు ఉండి పూర్తి వివరాలు సేకరించారని సమాచారం. వారు చేసిన దర్యాఫ్తు మేరకు అన్నపూర్ణ కారణంగానే సూరి, భాను మధ్య విభేదాలకు బీజం పడి తదనంతరం హత్యకు దారి తీసిందని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
కాగా ఎనిమిది నెలల క్రితం విజయవాడలోని అన్నపూర్ణ ప్యాకేజి ఇండస్ట్రీస్‌ను యజమాని పెద్ద కుమారుడు శ్యాంప్రసాద్‌ను బెదిరింపులకు గురి చేసి చిన్న కుమారుడు అయిన కృష్ణప్రసాద్‌కు రాయించి ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అన్నపూర్ణ విలువ సుమారు 2 కోట్ల నుండి మూడు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. అన్నపూర్ణ గొడవలో తన మధ్యవర్తిత్వాన్ని సూరి కూడా ఖండించారు. అయితే ఇప్పుడు సిసిఎస్ పోలీసులు చార్జీషీటులో అన్నపూర్ణ విభేదాలే హత్యకు కారణమయ్యాయని పేర్కొనడం విశేషం. అంతేకాదు ఈ అన్నపూర్ణ ప్యాకేజి గొడవలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడిపై కూడా ఆరోపణలు వచ్చాయి.