చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి కిరణ్ ఎసరు?

తాత్కాలికంగా చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆదిలోనే చిరంజీవికి చెక్ పెట్టాలనే ఆలోచనలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇందుకుగాను, కేంద్రంలో చిరంజీవికి మంత్రి పదవి దక్కకుండా చేయాలనేది ఆయన వ్యూహంగా చెబుతున్నారు. రాష్ట్రంలో చిరంజీవి సేవలు అవసరం ఉంటాయని చెప్పి ఆయనకు కేంద్ర మంత్రి పదవిని దూరం చేయాలని ఆయన అనుకుంటున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇక్కడ దెబ్బ కొడితే చిరంజీవి ముందుకు సాగడం కష్టమవుతుందని ఆయన అనుకుంటున్నారని చెబుతున్నారు.
కాగా, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ వీలైతే వారంలోగా జరగవచ్చునని అంటున్నారు. ఇప్పటికే మంత్రివర్గం నుంచి తొలగించేవారి జాబితాను, కొత్తగా చేర్చుకునేవారి జాబితాను ఆయన రూపొందించినట్లు చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనలో దీనిపై కాంగ్రెసు అధిష్టానంతో ఆయన చర్చలు జరిపే అవకాశాలున్నాయి. అయితే, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ఆషాఢ మాసం అడ్డు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మంత్రుల్లో కొంత మంది ముఖ్యమంత్రి మాట వినడం లేదు. వారి జాబితాను కూడా ఆయన తయారు చేసినట్లు తెలుస్తోంది. పైగా, వారు బొత్స సత్యనారాయణకు తోడ్పాటు అందిస్తున్నారు. ఇది కిరణ్ కుమార్ రెడ్డికి మింగుడు పడడం లేదు. దాంతో పూర్తిగా తనకు అనుకూలమైనవారిని మంత్రివర్గంలో చేర్చుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications