బెంగళూరు: కర్నాటక లోకాయుక్త సంతోష్ హెగ్డె ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిసి తాను చాలా బాధపడ్డానని కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప సోమవారం విలేకరులతో అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయంలో విచారణ చేయాల్సిందిగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కోరతానని చెప్పారు. లోకాయుక్తపై తనకు, తమ పార్టీకి గౌరవం ఉందని చెప్పారు. లోకాయుక్త నివేదికకు అందరం కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం తనకు ఇచ్చిన నివేదికపై సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. విపక్షాల ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు.
కాగా తన కుటుంబంతో కలిసి వారం రోజులు మారిషస్‌లో గడిపిన యెడ్యూరప్ప సోమవారం ఉదయం బెంగుళూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. యెడ్యూరప్ప రావడం కారణంగా లోకాయుక్త నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి మార్గం సుగమం కానుంది. గనుల కుంభకోణంలో లోకాయుక్త తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో యడ్యూరప్ప రాజకీయ భవితవ్యంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.