స్టార్ వార్: బాలయ్య, చిరంజీవి ఓట్లు రాలుస్తారా?

గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి పోటీ చేసిన చిరంజీవి అధికారానికి ఏ మాత్రం చేరువ కాలేకపోయారు. కేవలం 18 శాసనసభా నియోజకవర్గాల్లో విజయం సాధించి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కోసం బాలకృష్ణనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా చెమటోడ్చి ప్రచారాలు సాగించారు. కాంగ్రెసు పార్టీపైనే కాకుండా చిరంజీవిపైనా వారు మాటల కత్తులు దూశారు. కానీ ఫలితం కనిపించలేదు. సభలను హీరోలు అదరగొట్టారు. కానీ ఓట్లను మాత్రం తెలుగుదేశం అనుకూలంగా తేలేకపోయారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తాజాగా, కాంగ్రెసు తరఫున చిరంజీవి, తెలుగుదేశం పార్టీకి బాలయ్య స్టార్ కాంపైనర్లు అవుతారనేది ప్రస్తుత వాతావరణాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీల నాయకత్వాలు కూడా వీరి ద్వారా ప్రజలను ఆకట్టుకోవచ్చునని నమ్ముతున్నాయి. ఏమైనా, ఉప ఎన్నికలు ఈ ఇద్దరు హీరోలకు కూడా పరీక్షనే. రానున్న ఉప ఎన్నికల్లో వీరి చరిష్మా ఏ మేరకు పండుతుందనేది తేలిపోతుంది.












Click it and Unblock the Notifications