హైదరాబాద్: తనపై నిందలు వేసి తనను బాధపెట్టడం సరికాదని మహబూబాబాద్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు కవిత మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయంగా ఎదగడం చూడలేక కొందరు తనపై నిందలు వేస్తున్నారని ఆమె విమర్శించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారన్నారు. గిరిజన మహిళను అయిన తనను బాధ పెట్టడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. మద్యం వ్యాపారి నున్నా రమణకు తెలుగుదేశం పార్టీతోనే సంబంధాలు ఉన్నాయని ఆమె విమర్శించారు. అతడు క్రిమినల్, గంజాయి స్మగ్లర్ అని అన్నారు. మొన్న ఐదు లక్షలు అన్న అతను ఇప్పుడు ఇరవై ఐదు లక్షలంటున్నారని అన్నారు. తాను కూడా ఎవరో వ్యక్తికి కోటి రూపాయలు ఇచ్చానంటే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. మొదటి నుండి మహబూబాబాద్ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించే వాడని చెప్పారు. మద్యం ముడుపుల కేసులో ఎలాంటి విచారణను ఎదుర్కోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు. డిఎస్పీ వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు.
కాగా ఎమ్మెల్యే కవిత మహబూబాబాద్ లిక్కర్ సిండికేట్ నుండి రూ.25 లక్షలు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె సిండికేట్ నుండి డబ్బులు డిమాండ్ చేశారని ఎసిబి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లుగా వచ్చాయి. అంత ఇచ్చుకోలేమని సిండికేట్ చెప్పడం, ఆ తర్వాత ఓ పోలీసు అధికారి ఎమ్మెల్యే, సిండికేట్‌కు మధ్య మధ్యవర్తిత్వం వహించారని రిపోర్టులో పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె మంగళవారం స్పందించారు.