హైదరాబాద్: తెలంగాణను ఈ ప్రాంత నాయకులు మళ్లీ తెర మీదికి తెస్తున్నారు. ఏడు శానససభా స్థానాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ నాయకులు తెలంగాణను మళ్లీ తమ ఎజెండాగా చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అభివృద్ధి మంత్రం జపించిన ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం గురంచి మాట్లాడారు. వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణకు అనుకూలంగా శానససభలో తీర్మానం చేసే పరిస్థితి లేనందున ప్రత్యేకాధికారాలను వినియోగించి కేంద్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. తెలంగాణపై రాష్ట్రంలో ఏకాభిప్రాయం రాదని కాంగ్రెసు అధిష్టానం తేల్చిందని, అందువల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రమే చొరవ చూపాలని ఆయన అన్నారు. రాజీనామా చేయాల్సి వస్తే కడప ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహించి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేయాలని ఆయన అన్నారు.
తెలంగాణను అభివృద్ధి చేసినా ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. ఈ విషయాన్ని తాము అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం ఊహించిందేనని ఆయన అన్నారు. తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా తెలంగాణ రాగం ఆలపించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఉప ఎన్నికలో తెలంగాణ సెంటిమెంటు బలంగా పనిచేసిందని ఆయన అన్నారు. త్వరగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తాము పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.