కొడుకు జగన్ మాట నిలబెడుతున్న వైయస్ విజయమ్మ

జగన్ అరెస్టుకు ముందు విజయమ్మ పార్టీ పగ్గాలు చేపట్టే విషయంపై రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరిగింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆమె రాజకీయాలలో తలదూర్చిన సందర్భాలు లేవు. ఆయన మరణం తర్వాత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నా, తనయుడు జగన్ పార్టీ స్థాపించాక ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నా ఆమె ప్రధాన పాత్ర పోషించలేదు.
వైయస్ మృతి చెందే వరకు ఆమె రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటే, జగన్ అరెస్టు వరకు రాజకీయాలలో ఉన్నప్పటికీ ప్రధాన భూమిక పోషించలేదు. అంతే కాకుండా ఆమెకు వాక్చాతుర్యం లేదు. రాజకీయాలలో ఉన్నప్పుడు నలుగురితో ఎలా ఉండాలో, ప్రత్యర్థుల విమర్శలు ఎలా తిప్పి కొట్టాలో కూడా తెలియదనే చెప్పవచ్చు. ఈ కారణంగానే జగన్ అరెస్టుకు ముందు ఆమె పార్టీ పగ్గాలు చేపడితే ఎలా ఉంటుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది.
వాగ్ధాటి లేకపోవడం, రాజకీయానుభవం లేకపోవడం, ఎక్కువగా మాట్లాడే తరహా కాకపోవడం తదితర కారణాల వల్ల జగన్ అరెస్టయితే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన అప్పుడు వైయస్సార్ కాంగ్రెసులో కూడా కనిపించిందనే చెప్పవచ్చు. అయితే అందరి ఆలోచనలను పటాపంచలు చేస్తూ జగన్ తాను అరెస్టయితే తన తల్లి పార్టీని చూసుకుంటుందని చెప్పారు. ఇప్పుడు జగన్ మాటను విజయమ్మ నిలబెడుతున్నారు. అంతకుముందు గడప దాటని విజయమ్మ ఇప్పుడు బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో విజయమ్మ తన కూతురు షర్మిలతో కలిసి నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. ఆమె మాట తీరు ఆకట్టుకోలేక పోయినప్పటికీ వైయస్ సతీమణిగా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విజయమ్మ బదులు షర్మిల తన వాగ్ధాటితో ఓటర్లను ఆకట్టుకున్నారు. వారి ప్రచారం పార్టీ అభ్యర్థుల విజయానికి ఎంతో దోహదపడిందనే చెప్పవచ్చు. ఉప ఎన్నికలు పూర్తి కాగానే రైతుల సమస్యలు, జగన్‍పై వేధింపులు అంటూ ఆమె ఢిల్లీ బాట పట్టారు.
గతంలో విజయమ్మ ఢిల్లీ వచ్చారు. కానీ అప్పుడు వైయస్ సతీమణిగా, జగన్ తల్లిగా వచ్చారు. కానీ ఈసారి ఆమె ఓ బాధ్యతతో వచ్చారు. జగన్ విడుదలకు సహకారం కోరడంతో పాటు రైతుల సమస్యలను ఢిల్లీ నేతలకు తనదైన శైలిలో వినిపించారు. శుక్రవారం పార్టీ సమావేశంలో కూడా విజయమ్మ ఉద్విగ్న ప్రసంగం ఆకట్టుకుంది. విజయమ్మ పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపగలదో లేదో అని తొలుత భావించారు. కానీ ఆమె రాకతో కేడర్‌లో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి విజయమ్మ జగన్ మాటను నిలబెడుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications