150వ చిత్రానికి రాజకీయాలు అడ్డురావు: చిరంజీవి
ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు. తాను నటించబోయే నూటా యాభయ్యవ చిత్రానికి అభిమానుల్లోనూ, ప్రేక్షకులలోనూ ఆసక్తి నెలకొని ఉందని మంచి కథ కోసం ఆన్వేషిస్తున్నామని చెప్పారు. బ్రిటన్లో తనకు ఇంతమంది అభిమానులు ఉండటం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. సినిమాలలో రాణించిన చిరంజీవి రాజకీయాల్లోనూ చక్కగా రాణిస్తారని శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి లండన్ పరిసర ప్రాంతాలలోని చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కాగా తెలుగు భాషను ప్రోత్సహించేందుకు, తెలుగు జాతి చరిత్రను వెలుగులోకి తీసుకు రావడానికి తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత చిరంజీవి అన్న విషయం తెలిసిందే. శనివారం ఉదయం లండన్ బ్రిటిష్ లైబ్రరీలో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొదటి ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలను బ్రిటన్ మంత్రి అలిస్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. తెలుగు భాషా పరిరక్షణకు నడుం బిగిస్తానని, ఇంటి నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. తన మనవడు, మనవరాలు తెలుగులో మాట్లాడే విధంగా చూస్తున్నానని తెలిపారు. తెలుగు భాష రాష్ట్రంలో కన్నా విదేశాలలోనే ఎక్కువగా ఫరిడవిల్లుతోందని, మారిషస్ దేశమే అందుకు నిదర్శనమని అన్నారు. త్వరలోనే ఆ దేశంలో పర్యటిస్తానని చెప్పారు.