హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటు వేసి తిరిగి జైలుకు జగన్: విజయమ్మతో కాసేపు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రాష్ట్రపతి ఎన్నికలలో తన ఓటును వినియోగించుకున్నారు. చంచల్‌గూడ జైలు నుండి ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో జైలు అధికారులు జగన్‌ను, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలను అసెంబ్లీకి తీసుకు వచ్చారు. మొదట వచ్చిన మోపిదేవిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పలకరించారు. మంత్రులు, పలువురు నేతలు కూడా ఆయనను పలకరించారు. ఆ తర్వాత ఆయన తన ఓటును వేశారు.

అనంతరం కాసేపటికి జగన్ వాహనం వచ్చింది. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోకి రాగానే పార్టీ ఎమ్మెల్యేలు ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు. జగన్, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో కలిసి ఓటు వేసేందుకు లోనికి వెళ్లారు. జగన్ రావడానికి దాదాపు గంట ముందే వైయస్ విజయమ్మతో సహా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. జగన్ వచ్చే వరకు వారు ఓటు వేసేందుకు నిరీక్షించారు.

ఓటు వేసిన అనంతరం జగన్ నేరుగా మళ్లీ వాహనం ఎక్కి జైలుకు తిరిగి వెళ్లారు. ప్రాంగణంలో కాసేపు తల్లి విజయమ్మతో మాట్లాడారు. అంతకుమించి ఎవరితో మాట్లాడలేదు. జగన్ లోనికి వెళుతుండగా తారాసపడిన ప్రజాప్రతినిధులు అందరూ అతనిని విష్ చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెప్పారు. ఆయన ఎవరితోనూ మాట్లాడలేదన్నారు.

జగన్ అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై అసెంబ్లీ గేటు వద్దకు వచ్చారు. తమ పార్టీ నేతలు అనవసరంగా, అక్రమ కేసుల్లో అరెస్టు చేసి జైలులో పెట్టారని వారు మండిపడ్డారు. తమ నేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారు నల్లజెండాలతో తమ నిరసనను తెలియజేశారు.

అంతకుముందు మోపిదేవిని, జగన్‌ను వేర్వేరు వాహనాలలో అసెంబ్లీకి తరలించారు. రెండు వాహనాలు గల కాన్వాయ్‌లో ఒక ఎస్ఐ, పదిమంది కానిస్టేబుల్స్‌తో సహా మొత్తం పద్నాలుగు మందిని మోపిదేవి కాన్వాయ్‌లో నియమించారు. ఆ తర్వాత పది నిమిషాలకు జగన్‌ను జైలు నుండి బయటకు తీసుకు వచ్చారు. అతని కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఉన్నాయి. జగన్, మోపిదేవిలను ఇద్దరూ పదినిమిషాల వ్యవధిలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలో అసెంబ్లీకి తరలించారు.

జగన్‌ను జైలు నుండి బయటకు తీసుకు వచ్చే ముందు అక్కడకు భారీగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వారు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో డిజిపి, నగర పోలీసు కమిషనర్ భారీ భద్రతతో జగన్‌ను అసెంబ్లీకి తీసుకు వెళ్లాలని జైలు అధికారులను ఆదేశించారు.

English summary
YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy, party honorary president YS Vijayamma and other eighteen mlas used their vote in presidential polls on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X