థియేటర్లో ఫైరింగ్: బ్యాట్‌మన్ ప్రభావంతోనే!, జోకర్‌నని...

ఈ విషయంపై అక్కడి పత్రికలు పలు కథనాలు ప్రచురించాయి. తాజాగా అతడికి సంబంధించిన పూర్తి వివరాలను వారు సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఉన్మాదానికి కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు. కాల్పులు జరిపేందుకు హోమ్స్ థియేటర్‌లోకి ప్రవేశించే ముందు ఎలాంటి పరిస్థితి ఎదురైనా తాను సురక్షితంగా ఉండేందుకు తగిన ఏర్పాట్లతో వచ్చాడని పోలీసు అధికారి డాన్ ఓట్స్ తెలిపారు. హోమ్స్ ఉపయోగించిన తుపాకులు రెండు నెలల క్రితం చట్టప్రకారమే కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. భారీఎత్తున మందుగుండును కూడా అప్పటి నుంచే సేకరించాడని వివరించారు.
హాయిగా సినిమా చూస్తున్న వారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన తర్వాత తనను తాను ఓ జోకర్‌గా హోమ్స్ అభివర్ణించుకున్నాడని స్థానిక మీడియా కూడా కథనాలు ప్రచురించింది. ఇక, హోమ్స్ నివాసం సమీపంలో ఉండే వాళ్లంతా ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యావంతుడైన, తమ కళ్ల ముందు తిరిగే ఆ యువకుడు ఇలా కిరాతకుడిగా మారిపోయి 12 మంది ప్రాణాలను నిలువునా తీశాడన్న విషయన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక, ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైన అమెరికా అధ్యక్షుడు ఒబామా, అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రోమ్నీలు తన ప్రచార కార్యక్రమాలను ఒకరోజు రద్దు చేసుకున్నారు. అంతకుముందు జరిగిన ఒక కార్యక్రమంలో రోమ్నీ మాట్లాడుతూ జరిగిన దురదృష్టకర సంఘటనపై మాట్లాడటానికి మాటలు రావడం లేదని ప్రస్తుతం తాను పదవి కోసం పరుగెడుతున్న వ్యక్తిగా కాకుండా ఒక తండ్రిగా, తాతగా, ఒక భర్తగా, ఒక అమెరికన్‌గా తన బాధను వ్యక్తం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తన కార్యక్రమాలను రద్దు చేసుకుని అధ్యక్ష భవనానికి చేరుకున్న ఒబామా భద్రతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. జరిగిన సంఘటనపై తీసుకోవాల్సిన చర్యలను భద్రతను సమీక్షించారు.












Click it and Unblock the Notifications