ప్రభుత్వానికి ముప్పు ఉందా? జగన్ క్యాంప్ షాక్ ఇస్తే..

ఎవరి బలం ఎలా?
294 ఎమ్మెల్యేలు ఉన్న మన అసెంబ్లీలో ప్రభుత్వం నిలబడాలంటే కావాల్సిన మెజార్టీ 148. ప్రస్తుతానికి కాంగ్రెసుకు 156 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు(ఇందులో ఒకరు స్వతంత్ర ఎమ్మెల్యే, కాగా ముగ్గురు జగన్‌కు జై కొట్టారు). తెలుగుదేశం పార్టీకి 86, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17, తెలంగాణ రాష్ట్ర సమితికి 17, మజ్లిస్‌కు 7, సిపిఐకి 4, భారతీయ జనతా పార్టీకి 3, సిపిఎం 1, లోక్‌సత్తా 1 ఉన్నాయి.
కాంగ్రెసు 155
టిడిపి 86
వైయస్సార్సీ 17
టిఆర్ఎస్ 17
మజ్లిస్ 7
సిపిఐ 4
బిజెపి 3
సిపిఎం 1
లోక్ సత్తా 1
వీరు కాకుండా తెరాసకు ఒక ఇండిపెండెంట్, కాంగ్రెసుకు ఒక ఇండిపెండెంట్ మద్దతు ఉండగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి తటస్థంగా ఉన్నారు.
155+1గా ఉన్న కాంగ్రెసు పార్టీకి మజ్లిస్ పార్టీ మద్దతు ఉపసంహరిస్తే అంకెల పరంగా చూసుకుంటే వచ్చే నష్టమేమీ లేదు. మజ్లిస్ కలిస్తే ప్రభుత్వానికి 163 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది. మజ్లిస్ మద్దతు ఉపసంహరించడంతో అది 156కే పరిమితమైంది. అయితే ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్ పార్టీకి జై కొట్టారు. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానిలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్ ఇప్పటికే తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించారు. ఆయన ఆమోదించాల్సి ఉంది.
ఒకవేళ వారు ముగ్గురు వెళ్లినా ప్రభుత్వానికి అంకెలపరంగా చూస్తే వచ్చే నష్టమేమీ లేదు. 156 నుండి 153కు తగ్గుతుంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి పదవిని ఊడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పినట్లుగా ఆయన వెంట ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండి, ఆయన సాహసోపేత నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రభుత్వానికి కష్టకాలమే. అంతేకాకుండా ముందస్తు ఎన్నికలు వస్తే జగన్ పార్టీలోకి జంప్ అయ్యేందుకు కాచుక్కూర్చున్న ఎమ్మెల్యేలు కిరణ్‌కు ఝలక్ ఇస్తే మాత్రం పార్టీ పడిపోక తప్పదు.
అయితే అలాంటి పరిస్థితి ఎదురు కాకపోవచ్చుననేది కాంగ్రెసు పార్టీ నేతల ధైర్యం ఎన్నికలకు మరో సంవత్సరంన్నర గడువు ఉన్నందున జగన్ వైపు వెళ్లాలనుకునే ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని కూల్చాలనే భావనతో ఉండరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఎలాంటి భయం లేకున్నా ముందు ముందు ఏదైనా జరగవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications