తెలంగాణ: బిజెపితో పొత్తుపై కెసిఆర్ తిరకాసు

తెలంగాణకు అనుకూలంగా ఉన్న సిపిఐ, బిజెపిలతో పొత్తు పెట్టుకోవాలనే అభిప్రాయం పార్టీలోని ఓ వర్గం చేస్తోంది. అయితే, అందుకు ఏ మాత్రం సుముఖంగా లేని కెసిఆర్ సోమవారం పార్టీ ముఖ్య నేతలు కొంత మందితో సమావేశమయ్యారు. బిజెపితో ముందుగానే పొత్తు పెట్టుకుంటే ఫలితాలు వెలువడిన తర్వాత సమస్యలు ఎదురవుతాయని ఆయన చెప్పారు. బిజెపి అధికారంలోకి రాలేని పక్షంలో తెలంగాణ సాధించడానికి అనువుగా ఢిల్లీలో చక్రం తిప్పడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
బిజెపి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఫరవాలేదు గానీ తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే తెలంగాణ సాధించడానికి వీలైన వాతావరణం ఉండదని ఆయన అన్నారు. కాంగ్రెసు వీలైతే ములాయం సింగ్ నాయకత్వంలోని తృతీయ ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చి బిజెపిని అడ్డుకోవచ్చునని ఆయన అన్నారు.
పొత్తు పెట్టుకుంటే ఎన్నికలకు ముందే ఓ పార్టీకి తాము కట్టుబడి ఉన్నట్లు అవుతుందని, ఏ పార్టీకి కట్టుబడి ఉండకుండా, ఎన్నికల తర్వాత తెలంగాణ సాధించడానికి అనువువైన వ్యూహాన్ని అనుసరించడానికి వెసులుబాటు ఉంచుకోవాలని ఆయన పార్టీ నాయకులకు చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద, ఇతర తెలంగాణవాద పార్టీలను కూడా నిలువరించేందుకు కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications