విభజనే: హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటు?
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలోని రెండేసి జిల్లాలను ఇరు రాష్ట్రాల కింద విడగొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ముసాయిదాను రూపొందించినట్లు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ గురువారం సాయంత్రం ఓ వార్తాకథనం ప్రసారం చేసింది. స్టేట్ ఆఫ్ ఆంధ్ర, స్టేట్ ఆఫ్ హైదరాబాదుగా రాష్ట్రాన్ని విభజించాలని రెండు వారాల క్రితం రూపొందించిన ముసాయిదా పత్రంలో పేర్కొన్నట్లు ఆ వార్తాకథనం సారాంశం. అయితే, ఇది తుది నిర్ణయం కాదని కూడా ఆ టీవీ న్యూస్ చానెల్ తెలిపింది.
ఆ న్యూస్ చానెల్ వార్తాకథనం ప్రకారం - కర్నూలు, అనంతపురం జిల్లాలను హైదరాబాదు రాష్ట్రంలో కలుపుతారు. చిత్తూరు, కడప జిల్లాలను ఆంధ్ర రాష్ట్రంలో కలుపుతారు. తద్వారా రాయలసీమ, తెలంగాణ పదాలు కనుమరుగువుతాయి. ఆంధ్ర రాష్ట్రం రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకు హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.

ఆ ముసాయిదాను 15 రోజుల క్రితం కోర్ కమిటీ సమావేశంలో రూపొందించినట్లు తెలుస్తోంది. దాన్ని ముసాయిదా కన్నా నోట్‌గా చెప్పడమే సమంజసం కావచ్చు. ఈ ముసాయిదాపై రేపు శుక్రవారం కోర్ కమిటీ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. జలవివాదాలు తలెత్తకుండా పాత భద్రాచలం ప్రాంతాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 1959కి పూర్వం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రాంతాలను తిరిగి ఆ జిల్లాలో కలుపుతారు.
తెలంగాణపై సందిగ్ఘతను తొలగించడానికి మాత్రమే కోర్ కమిటీ సమావేశం జరుగుతోందని దిగ్విజయ్ సింగ్ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. కాగా, రాజ్యాంగ సవరణ అవసరమవుతుందని దిగ్విజయ్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ అవసమవుతుంది. రాజ్యాంగ సవరణ ద్వారా జోనల్ వ్యవస్థను రద్దు చేసి, హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాల్సి ఉంటుంది.
కాంగ్రెసు అధిష్టానం రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రాయల తెలంగాణకు హైదరాబాద్ రాష్ట్రంగా నామకరణం చేయాలని ఉద్దేశించినట్లు అర్థమవుతోంది. రాయలసీమను విడగొట్టాలనే ప్రతిపాదనను ఆ ప్రాంత నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెసు అధిష్టానం ఆలోచన మారే అవకాశాలు కూడా లేకపోలేదు. రాయలసీమ నేతల మాటల్లోని తీవ్రతను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై వ్యక్తమైన అభ్యంతరాలపై శుక్రవారంనాటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications