narendra modi ap tour guntur kerala bjp tdp andhra pradesh amaravati protests మోదీ గుంటూరు బిజెపి టిడిపి
ప్రధాని ఏపి పర్యటన వాయిదా..? కారణం ఇదేనా..!
ప్రధాని మోదీ ఏపి పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల 6వ తేదీన ప్రధాని కేరళ..ఏపి పర్య టన ముందుగా ఖరారైంది. అయితే, కేరళ పర్యటన యధాతధం అని చెబుతున్న పార్టీ వర్గాలు ఏపి పర్యటన మాత్రం సందిగ్దంలో పడిందని..వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు..అయితే, కారణాలేంటో చూస్తే..
వాయిదా వెనుక..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 6న ఏపి లోని గుంటూరు పర్యటన వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం జనవరి 6న ప్రధాని కేరళ..ఏపి పర్యటన కు రావాల్సి ఉంది. ఇందుకు సంబం ధించి..గుంటూరు లో బిజెపి నేతలు భారీ ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ప్రధాని సభను అడ్డుకుంటామని టిడిపి తో పాటుగా వామపక్ష పార్టీలు ప్రకటించాయి. ఇది ఇలా ఉంటే..కేరళ పర్యటనపై సందిగ్ధం ఉండటంతో ఏపీ టూర్ వాయిదా పడే ఛాన్స్ ఉంది.

దీనిపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేరళ బీజేపీ వర్గాలు నిర్ణయించిన ప్రకారం తిరువనంతపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మోదీ మధ్యాహ్నం నుంచి ఏపీ పర్యటనకు బయలు దేరాల్సి ఉంది. అయితే సభా వేదికను తిరువనంతపురంలో కాకుండా శబరిమలై సమీపంలోని పట్టణంతిట్టాకు మార్చాలని కేరళ బీజేపీ వర్గాలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రధాని సభ తిరువనంతపురంలో కాకుండా పట్టణంతిట్టలో జరిగితే మోదీ సకాలంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోలేరని, జనవరి 6న గుంటూరులో జరగాల్సిన సభ వాయిదా పడక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవాళ స్పష్టతకు ఛాన్స్..
ప్రధాని మోదీ కేరళ సభ నిర్వహణ ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్రధాని పర్యటనపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో.. పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి 12, 13 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించాలని బీజేపీ అధిష్టానం తొలుత నిర్ణయించింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా ఈ సమావేశాలను ముందుకు జరపాలనే తర్జనభర్జనలు పార్టీలో సాగుతున్నాయి. ఈ ప్రభావం కూడా సభ వాయిదాకు దారి తీయవచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి.
కేరళలో మోదీ సభను శబరిమలై సమీపంలోని పట్టణంతిట్టకు మార్చా లని ఆ రాష్ట్ర కమలనాథులు కోరుకుంటున్నారు. ఎందుకంటే శబరిమలై ఆలయానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ ప్రాంతంలో నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. వీటితో తమకు ఆ ప్రాంతంలో సానుకూల వాతావరణం ఉందని కేరళ బీజేపీ భావిస్తోంది. ఇలాంటి సందర్భంగా అక్కడ మోదీ సభ జరిగితే తమకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ గుంటూరు కు వస్తారా లేక పర్యటన వాయిదా పడుతుందా అనేది ఈ రోజో రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది..