మరోసారి 'బీసీ' మంత్రం.. ఎన్నికల జపం.. చంద్రబాబు ''వ్యూహం'' ఫలించేనా?
అమరావతి : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీలపై టీడీపీ నజర్ పెట్టిందా? వారికి దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందా? రానున్న ఎన్నికల్లో బీసీల ఓట్లే కీలకమని భావిస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి.
దేశ జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. ఎన్నికల్లో బీసీల ఓట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలపై దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్టీఆర్ స్ఫూర్తి.. బీసీ జపం
కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయాల్లోకి బంపర్ ఎంట్రీ ఇచ్చిన ఎన్.టి.రామారావు, తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమాజంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించారు. ఆ క్రమంలో పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు. వెనుకబడిన తరగతుల వారిని ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయంగా కూడా బీసీలు ఎదిగేలా ఎన్టీఆర్ కృషి చేశారనే పేరుంది. అలా బీసీలకు దగ్గరైన పార్టీగా ముద్రవేసుకుంది టీడీపీ. ఎన్టీఆర్ స్ఫూర్తి కొనసాగిస్తూ బీసీ వర్గానికి పెద్దపీట వేస్తున్నానంటున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ క్రమంలో బీసీ విద్యార్థులకు ప్రోత్సాహాకాలు, విదేశీ విద్య ఆదరణ, ఎన్టీఆర్ విద్యోన్నతి తదితర కార్యక్రమాలతో పాటు బీసీల సంక్షేమానికి పాటుపడతున్నామని చెబుతున్నారు.

జయహో బీసీ.. మేధోమథనం
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మరోసారి బీసీ మంత్రం జపిస్తున్నారు. ఈనెల 27న (ఆదివారం) తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో "జయహో బీసీ" సదస్సు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఆ నేపథ్యంలో సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సభ విజయవంతం కావడానికి ఏంచేయాలనేదానిపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆది నుంచి టీడీపీకి బీసీలే వెన్నెముకగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. బీసీల అభివృద్ధి కోసం మేధోమథనం చేయడానికే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించి గుర్తింపు ఇచ్చిన మొట్టమొదటి నేత ఎన్టీఆరే అని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలో ఉండటానికి బీసీలే కారణమన్న చంద్రబాబు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బీసీలు పార్టీకి అండగా నిలిచారని తెలిపారు.
మూడ్ ఆఫ్ ది నేషన్: వైసీపీ, టీఆర్ఎస్ సహా దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలదే హవా

బీసీల అండ.. కొండంత బలం
టీడీపీ పట్ల బీసీలది ఒకే వైఖరి ఉంటుందన్నారు చంద్రబాబు. కొన్ని సందర్భాల్లో ఆయా వర్గాలు కొన్నిసార్లే టీడీపీకి ఓట్లు వేశాయని.. బీసీలు మాత్రం ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతకుముందున్న ప్రభుత్వాలు బీసీలకు కమిషన్లు, ఫెడరేషన్లు అంటూ ఎన్నో పెట్టినా ఒక్క రూపాయి కూడా బీసీలకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. వెనుకబడిన వర్గాల అండ టీడీపీకి కొండంత శక్తిగా అభివర్ణించారు. వారు టీడీపీకి సపోర్టుగా ఉన్నంతకాలం ఎవరూ ఏమి చేయలేరని.. టీడీపీని ఢీకొట్టలేరని వ్యాఖ్యానించారు. మొత్తానికి మరోసారి బీసీ మంత్రంతో ఎన్నికల బరిలోకి దిగుతున్న చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.