ఆదిపురుష్... ట్రైలర్ టాక్
ఆదిపురుష్... చిత్రానికి ఏ ముహూర్తంలో ఈ పేరు పెట్టారో కానీ అప్పటి నుంచి ఈ సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. టీజర్ విడుదలైనప్పుడు ఏ అగ్ర కథానాయకుడి సినిమాకు సంబంధించి గతంలో రానన్ని విమర్శలు ఆదిపురుష్ టీజర్ పై వచ్చాయి. దీంతో ఈ చిత్ర బృందం గ్రాఫిక్స్ కు సంబంధించి పలు మార్పులు, చేర్పులు చేపట్టింది. అన్నీ సరిచూసుకొని చేపట్టిన మార్పులతోనే తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.
వివాదానికి కాదేదీ అనర్హం అనే రీతిలో ట్రైలర్ పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలో చూపించిన గ్రాఫిక్స్ కన్నా చిన్న పిల్లల సినిమాల్లో చిన్నారులను ఆకట్టుకోవడానికి చేసే గ్రాఫిక్స్ బాగుంటాయని వ్యాఖ్యలు వచ్చాయి. రామాయణం అంటే మన కన్నుల ముందు అతి సుమధుర మనోహర రూపమైన రాముడు కదలాడుతాడని, కానీ రాముడి వేషధారణ ప్రభాస్ కు నప్పలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్ కు ఉన్న మార్కెట్ ను క్యాష్ చేసుకుందామనే యావేకానీ పూర్తిస్థాయిలో సినిమాపై దృష్టిపెట్టి చిత్రీకరించిన దాఖలాలే కనపడంలేదంటున్నారు.

దర్శకుడు ఓం రౌత్ దగ్గరుండి చేయించిన మార్పులు, చేర్పులు ఇవేనా అంటూ ప్రభాస్ అభిమానులు కూడా బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. అభిమానుల కోసం హైదరాబాద్ లోని ఏంఎంబీ మాల్ లో ఒకరోజు ముందే థియేటర్ లో ట్రలర్ ను విడుదల చేశారు. ఈరోజు ప్రత్యేకంగా మళ్లీ మీడియా కోసం ప్రదర్శించారు. ప్రభాస్ కు జోడీగా, సీత పాత్రలో కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16వ తేదీన భారీగా విడుదల కానుంది. అదేరోజు త్రీడీలో కూడా విడుదల చేస్తున్నారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు... ఇలా అన్ని పాత్రలకూ ట్రైలర్ లో సమ ప్రాధాన్యం లభించింది. '
రాఘవుడు నన్ను పొందడానికి శివ ధనుస్సు విరిచాడు.. ఇప్పుడు రావణుడి గర్వాన్ని కూడా విరిచేయాలి' అని సీతా దేవి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. 'నా కోసం పోరాడకు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథను చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అహకారం రొమ్ము చీల్చి... ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' అని శ్రీరాముని పాత్రలో ప్రభాస్ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంది.












Click it and Unblock the Notifications