'లెజెండ్'తో స్టాప్: ఇక రాజకీయాల్లో బాలయ్య దూకుడు?
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నందమూరి హీరో బాలకృష్ణ కొత్త సినిమాలేవీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. కొత్త కథలను ఆయన వినడం లేదని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న లెజెండ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
ఆ సినిమా అయిపోగానే బాలయ్యతో సినిమాతో తీయడానికి తమిళ దర్శకుడు హరి సిద్ధమైనట్లు, అందుకు ఆయన కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. లెజెండ్ సినిమా అయిపోగానే హరి బాలకృష్ణకు కథ వినిపిస్తాడని చెబుతున్నారు. అయితే, బాలకృష్ణ కొత్త సినిమాలను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరట. పూర్తిగా ఆయన లెజెండ్ సినిమా మీదనే దృష్టి కేంద్రీకరించారు.

ఎన్నికలు వచ్చేలోగా లెజెండ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని బాలయ్య అనుకుంటున్నట్లు సమాచారం. ఆ సినిమా నిర్మాణం పూర్తియిన వెంటనే రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించనున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాతనే మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం.
లెజెండ్ సినిమా షూటింగ్ నిర్మాణం పూర్తయి, విడుదలయ్యేలోగా రాష్ట్ర విభజన అంశం కూడా కొలిక్కి వస్తుందని బాలకృష్ణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయా, ఒక్క రాష్ట్రంలో జరుగుతాయా అనేది తేలిపోతుందని అంటున్నారు. అప్పుడు ప్రజల వద్దకు వెళ్తే పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన వ్యవహారం ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో ఆయన ఏమీ మాట్లాడడం లేదు.
రాష్ట్ర విభజనపై ప్రస్తుతం మౌనంగా ఉండడమే మేలని కూడా బాలకృష్ణ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. సినిమాల్లో తీరిక లేకపోవడం వల్ల రాజకీయాలకు దూరంగా ఉండి, రాష్ట్ర విభజనపై మాట్లాడాల్సిన అనివార్యత నుంచి ఆయన దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications