పెప్పర్ స్ప్రే చేశాకే లగడపాటిపై దాడి జరిగింది: నామా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ లోక్‌సభలో పెప్పర్ స్ప్రే ఉపయోగించిన తర్వాతనే అతనిపై ఇతర ఎంపీలు దాడి జరిగిందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభలో ఎవరూ ఎవరి మీద దాడి చేయలేదని తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో అడ్డుకోవడంతోనే సీమాంధ్ర ఎంపీలను వారించామని నామా తెలిపారు.
గుండె పోటుతో కొట్టుకుంటున్న ఎంపి కొనకళ్ల నారాయణను సీమాంధ్ర ఎంపీలు ఎవరూ పట్టించుకోలేదని, తాను, మరో ఎంపి రమేష్ రాథోడ్ కలిసి ఆస్పత్రికి తరలించామని చెప్పారు. మోదుగుల చేతిలో ఉన్నది మైకు ముక్కేనని ఆయన అన్నారు. లగడపాటిపై దాడి చేసిన వారిలో ఇతర రాష్ట్రాల ఎంపీలే ఉన్నారని చెప్పారు. పార్లమెంటులో నెలకొన్న గందరగోళానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు.

తెలుగుదేశం పార్లమెంటరీ పక్ష నేత ఎవరనేది పార్టీ అధిష్టానం తేలుస్తుందని నామ అన్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణకు వ్యతిరేకం కాదని, బిల్లుపై చర్చను కోరుతోందని నామా నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. వారి బెదిరింపులు ఇక సాగవని అన్నారు. లగడపాటి రాజగోపాల్‌ను భగత్ సింగ్‌తో పోల్చడం సరికాదని, అతన్ని టెర్రరిస్టులతో పోల్చాలని మరో టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
స్పీకర్ ఆత్మరక్షణలో పడ్డారు: పయ్యావులు
పార్లమెంటులో జరిగిన ఘటనలో స్పీకర్ మీరా కుమార్ ఆత్మరక్షణలో పడ్డారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సభలో స్పీకర్ వ్యవహరించిన తీరుపై దేశానికి వివరణ ఇచ్చుకోవాలని అన్నారు. దాడికి పాల్పడిన ఇతర ఎంపీలను సస్పెండ్ చేయకుండా సీమాంధ్రకు చెందిన 16మంది ఎంపీలను సస్పెండ్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ చర్యను స్పీకర్ ఎలా సమర్థించుకుంటారని పయ్యావుల ప్రశ్నించారు. స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యహరించారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతునొక్కి చట్టాలను తీసుకురావాలనుకుంటే దేశంలో తాలిబన్ల రాజ్యం వస్తుందని అన్నారు. జాతీయ పార్టీలు ఈ ఘటనపై ఆలోచన చేయాలని పయ్యావుల సూచించారు. రాష్ట్ర విభజన బిల్లుపై సీమాంధ్ర ప్రజల వాదనను వినిపించేందుకు తిరిగి సస్పెండ్ చేసిన ఎంపీలను సభలోకి ప్రవేశించేలా చూడాలని కోరారు. ఇందుకు ఇతర సభ్యులు కూడా సహకరించాలని అన్నారు.












Click it and Unblock the Notifications