Aghori news: తనను చంపెయ్యాలన్న అఘోరీ.. నెక్స్ట్ ప్రయాణం అక్కడికేనట!
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న అఘోరి నిన్న శ్రీకాళహస్తిలో ఆత్మార్పణ యత్నం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలోనికి దుస్తులు లేకుండా వెళ్లకూడదని సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగిన అఘోరి ఆ తర్వాత తన కారులో ఉన్న పెట్రోల్ డబ్బా ని తీసుకుని మీద పోసుకుని ఆత్మ త్యాగం చేసుకుంటానని హంగామా చేశారు.
అఘోరీ కారుకు యాక్సిడెంట్..
పెట్రోల్ పోసుకున్న అఘోరిని అడ్డుకున్న పోలీసులు ఆమెకు నీళ్లు పోసి దుస్తులు ధరింపజేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇక నేడు మళ్ళీ శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన అఘోరి నాగశక్తి పీఠాధిపతి సూచనతో దుస్తులు ధరించి రావడంతో సెక్యూరిటీ సిబ్బంది దర్శనానికి అనుమతించారు. దీంతో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని మళ్లీ ప్రయాణం మొదలుపెట్టిన అఘోరీ కారుకు యాక్సిడెంట్ కావడంతో కారును రిపేర్ నిమిత్తం మెకానిక్ షెడ్ లో పెట్టారు.

తన కార్ యాక్సిడెంట్ కు పోలీసులే కారణం అన్న అఘోరీ
అఘోరి మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తను యాగంటి కి వెళుతున్నానని, ఆ తరువాత మహానంది, శ్రీశైలం వెళ్లి పూజలు చేస్తానని అఘోరి తెలిపారు. తన కారు రిపేర్ అయ్యేంతవరకు పాదయాత్ర చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తనను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరి పోలీసులు తనను ఇబ్బందులు పెట్టడం వల్లనే తన కారు యాక్సిడెంట్ జరిగిందని పేర్కొన్నారు.
చంపెయ్యాలని షాకింగ్ వ్యాఖ్యలు
పోలీసులు తనను ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారో పెట్టండి అంటూ సవాలు విసిరారు. తనను చంపేయాలని లేదా ఉరిశిక్ష వేస్తే పీడ పోతుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా పుణ్యక్షేత్రాలను తిరిగి దర్శనం చేసుకుని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన వంతుగా ప్రయత్నం చేయాలని భావిస్తున్న తనను అడుగడుగున ఇబ్బందులకు గురి చేస్తున్నారని లేడీ అఘోరి లబోదిబోమన్నారు.
తెలుగు రాష్ట్రాలలో అఘోరీపై చర్చ
ఇక మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేడీ అఘోరి చేస్తున్న హల్చల్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఇక ప్రస్తుతం యాగంటి, శ్రీశైలం, మహానంది దర్శనం కోసం వెళ్తానని చెప్తున్న అఘోరీ అక్కడ ఇంకేం హంగామా చేస్తుందో మరి.












Click it and Unblock the Notifications