ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు - షర్మిల నియోజకవర్గం ఫిక్స్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు పార్టీల ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థులను ఖరారు చేసింది. వైసిపి తమ అభ్యర్థుల జాబితా పూర్తి చేసింది. వామపక్షాలతో కలిసి కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్న కాంగ్రెస్ తమ ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. షర్మిల పోటీ చేసే స్థానం పైన కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది.
కాంగ్రెస్ అభ్యర్థులు
ఏపీలో ఎన్నికల రాజకీయం పతాక స్థాయికి చేరింది. జగన్ ఓటమి లక్ష్యంగా బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. కూటమి నుంచి రెండు అసెంబ్లీ స్థానాలు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వైసిపి మొత్తం 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఏపీలో కాంగ్రెస్ వామపక్షాల కూటమి పొత్తులో భాగంగా ఎవరైనా సీట్లు పోటీ చేయాలనే దానిపైన ఒక అంచనాకు వచ్చాయి. కాంగ్రెస్ పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితా పైన పార్టీ నాయకత్వం కసరత్తు చేసింది. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కడప బరిలో షర్మిల
పిసిసి చీఫ్ షర్మిల పోటీ చేసే స్థానం పైన కాంగ్రెస్ నాయకత్వం స్పష్టత ఇచ్చింది. కడప ఎంపీగా షర్మిల పోటీ చేయనున్నారు. వైసిపి నుంచి అవినాష్ రెడ్డి ఇప్పటికే బరిలోకి దిగారు. వైఎస్ కుటుంబంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. అవినాష్ లక్ష్యంగా వివేక హత్యలో ఎదురవుతున్న ఆరోపణల నడుమ ఇప్పుడు కడపలో అవినాష్ వర్సెస్ షర్మిల పోరు ఆసక్తికరంగా మారుతుంది. టిడిపి నుంచి ఇప్పటికే భూపేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. చివరి నిమిషంలో మార్పులు జరిగితే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాలో రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జెడి శీలం, కాకినాడ నుంచి పల్లంరాజు పోటీ చేయనున్నారు.
కాంగ్రెస్ జాబితా
అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, విశాఖ నుంచి సత్యారెడ్డి, ఏలూరు నుంచి లావణ్య, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, హిందూపురం నుంచి షాహిన్, చిత్తూరు బరిలో చిట్టిబాబు పేర్లు ఖరారు అయ్యాయి. కాగా పిసిసి మాజీ చీఫ్ రఘువీరారెడ్డి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఆయన ప్రచారానికి పరిమితం కానున్నారు. మరో ఎనిమిది ఎంపీ స్థానాలు, 58 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఇప్పుడు షర్మిల పోటీ చేస్తున్న కడప ఎంపీ స్థానం పైనే రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతుంది.












Click it and Unblock the Notifications