84 సీసీటీవీలు తేల్చలేకపోయిన ఆకివీడు మహిళ మర్డర్ మిస్టరీ ఒక్క సర్జికల్ స్క్రూ తేల్చింది!
నేరం చేసినా దొరక్కుండా రకరకాల ప్రయత్నాలు చేస్తారు నేరగాళ్ళు. ఎక్కడా ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండా జాగ్రత్త పడతారు. ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా, నేరానికి వాడిన వస్తువులు దొరకకుండా, ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా చేస్తే కేసునుండి బయటపడొచ్చు అని భావిస్తారు. ఇక ఇదే క్రమంలో ఇటీవల ఉప్పుటేరు వద్ద మహిళ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ఎలాంటి ఆధారాలు దొరకక, అసలు ఆ మహిళ ఎవరనేది కూడా గుర్తించలేక చాలా ఇబ్బందిపడ్డారు.
మహిళ మర్డర్ మిస్టరీని చేదించిన సర్జికల్ స్క్రూ
అయితే మహిళను గొంతు పిసికి చంపినట్టు ఆనవాళ్ళు ఉండటంతో హత్యగా భావించి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఒక సర్జికల్ స్క్రూ మిస్టరీని తేల్చేసింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో గుర్తుతెలియని మహిళ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసులో ఒక్క సర్జికల్ స్క్రూ సీరియల్ నంబర్ కీలక ఆధారంగా మారింది.

84 సీసీటీవీల ఫుటేజీలు చూసినా నో క్లూ
ఈ నెల 15న ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వద్ద దుప్పటిలో చుట్టి పొదల్లో పడేసిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం చూస్తే గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో సహా ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 84 సీసీటీవీల ఫుటేజీలు, మిస్సింగ్ కేసులు, ఆశా కార్యకర్తలు, సోషల్ మీడియా ద్వారా సమాచారం సేకరించినా ఫలితం రాలేదు.
సర్జికల్ స్టీల్ ప్లేట్, స్క్రూ పై ఉన్న సీరియల్ నంబర్ ఆధారంగా కేసు ఛేదన
పోస్టుమార్టంలో మృతురాలి ఎడమ కాలికి సర్జికల్ స్టీల్ ప్లేట్, స్క్రూ ఉన్నట్లు తేలింది. ఆ స్క్రూ ముంబై కంపెనీ సరఫరా చేసిందని, యూనిక్ సీరియల్ నంబర్ ఆధారంగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి రికార్డులు పరిశీలించారు. ఆ మహిళ రోడ్డు ప్రమాదంలో గాయపడి సర్జరీ చేయించుకున్న ఉప్పాడ దేవిగా నిర్ధారణకు వచ్చారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల విభేదాల కారణంగా భర్త నారాయణరావు భీమవరంలోని అపార్ట్‌మెంట్‌లో గొంతు నులిమి హత్య చేశాడు.
సర్జికల్ ఇంప్లాంట్ ఆధారంగా ఆమె ఎవరు అనేది గుర్తించిన పోలీసులు
మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి ఉప్పుటేరు వద్ద పడేశాడు. సర్జికల్ ఇంప్లాంట్ ఆధారంగా ఆమె ఎవరు అనేది గుర్తించిన పోలీసులు భర్తనే హత్య చేసినట్టు గుర్తించారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక చిన్న సర్జికల్ స్క్రూ తో పోలీసులు కేసు చేదించటం, నిందితుడిని పట్టుకోవటం జరిగింది.












Click it and Unblock the Notifications