జగన్, చంద్రబాబుతో పాటు రంగంలోకి పవన్ కళ్యాణ్ కూడా ... ఇక సమరమే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రా కదలిరా అంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేసి, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని మద్దతు కోసం ప్రయత్నం చేస్తుంటే, వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు.
ఇక ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే రంగంలోకి దిగనున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ ఉన్న సీట్ల సర్దుబాటు అంశానికి తాలూకు ఇబ్బందిని పక్కనపెట్టి, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా ఎన్నికల ప్రచారానికి దిగనున్నారు.

ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం తో పాటు కీలకమైన కొన్ని జిల్లాలను టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. అక్కడ వారాహి యాత్రతో పాటు కుదిరితే కొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పాదయాత్ర కూడా చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగానే వ్యూహం రెడీ చేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ రెడీ అయినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ మొదట అనకాపల్లి నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈసారి ఇక్కడ నుండే పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలలో ప్రాథమికంగా పవన్ కళ్యాణ్ యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైంది.
అయితే అవసరాన్ని బట్టి ఈ రూట్ మ్యాప్ మారే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా పార్టీ నాయకులతో మరికొన్ని కార్యక్రమాలు కూడా నిర్ణయించి కొనసాగించనున్నారు అని సమాచారం. ఎన్నికలలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి కూడా టీం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రచారం చేస్తుంటే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 4 నుండి రంగంలోకి దిగనున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.












Click it and Unblock the Notifications