కుబేర మంత్రులు: ఏపీ నారాయణ ఆస్తి రూ. 496 కోట్లు
న్యూఢిల్లీ: భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని మంత్రుల ఆస్తులు, వారి మీద ఉన్న కేసుల వివరాలు బయటకు రావడంతో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అన్ని రాష్ట్రాల్లోని మంత్రుల కంటే ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ అగ్రస్థానంలో ఉన్నారు.
మంత్రుల ఆస్తులు, వారి మీద ఉన్న కేసుల గురించి ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. అన్ని రాష్ట్రాల్లోని మంత్రుల ఆస్తుల వివరాలతో పోల్చుకుంటే సగటున ఆంధ్రప్రదేశ్ మంత్రులే అగ్రస్థానంలో ఉన్నారు.
దేశంలోని 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాల్లోని మంత్రుల వివరాలు సేకరించిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఈ వివరాలు తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న 620 మంది మంత్రుల్లో 609 మంత్రుల డేటాను ఏడీఆర్ విశ్లేషించింది.

కుబేర మంత్రినారాయణ
ఈ వివరాల ప్రకారం రాష్ట్రాల్లోన్ని కుబేర మంత్రుల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ. 496 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు.

శివకుమార్
కర్ణాటక మంత్రి శివకుమార్ రూ. 251 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నారు.

ఏపీ మంత్రుల సగటున ఆస్తి రూ. 45.49 కోట్లు
దేశవ్యాప్తంగా మంత్రుల ఆస్తులు సగటు రూ. 8.59 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఆస్తి సగటు రూ. 45.49 కోట్లు.

కర్ణాటక రెండవ స్థానం
ఆంధ్రప్రదేశ్ తరువాత మంత్రుల ఆస్తుల సగటున కర్ణాటక రెండవ స్థానంలో, మూడవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి.

త్రిపుర లాస్ట్
మంత్రుల అత్యల్ప ఆస్తుల సగటు ప్రకారం త్రిపుర మంత్రులు రూ. 31.67న చివరి స్థానంలో ఉన్నారు.

క్రిమినల్ కేసులు
34 శాతం రాష్ట్ర మంత్రులపై 210 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 113 మంది మంత్రుల మీద హత్య, కిడ్నాప్ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్ర ఫస్ట్
కేసుల జాబితాలో మహారాష్ట్రలోని 18 మంది మంత్రులు మొదటి స్థానంలో ఉన్నారు. బీహార్ లో 11 మంది మంత్రులు, తెలంగాణలో 9 మంది మంత్రులు, జార్ఖండ్ లో 9 మంది మంత్రుల మీద కేసులు ఉన్నాయి.

మహిళా మంత్రులు 51 మంది
దేశంలోని 609 మంది మంత్రుల్లో 51 మంది మహిళా మంత్రులు ఉన్నారు. వారిలో ఎక్కువగా మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి ఎక్కువ మంది మహిళా మంత్రులు ఉన్నారు.

కేంద్ర మంత్రులపై కేసులు
కేంద్ర మంత్రుల్లో 14 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. కేంద్ర మంత్రుల సగటు ఆస్తి రూ. 12.94 కోట్లు ఉందని ఏడీఆర్ తెలిపింది.












Click it and Unblock the Notifications