తిరుమలలో మంట కలుస్తున్న ఆగమ శాస్త్ర నిబంధనలు- అరిష్టం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం నాడు 72,745 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,156 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.48 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- తిరుమలలో మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కొలువుదీరిన సప్తగిరులు, శ్రీవారి ఆలయం గగనతలంపై విమానాల రాకపోకలు ఆగమ శాస్త్ర నియమ నిబంధనలను పూర్తి విరుద్ధం. అందుకే- దీన్ని గౌరవిస్తూ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా నో ఫ్లైజోన్‌గా ప్రకటించారు.
దీన్ని ఉల్లంఘిస్తూ తాజాగా మరో విమానం చక్కర్లు కొట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భక్తులను తీవ్ర ఆందోళన, ఆవేదనకు గురి చేసింది. అతి తక్కువ ఎత్తులో వెళ్లిపోవడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మధ్యకాలంలో తరచుగా విమానాలు ఆలయం గోపురం మీదుగా తిరుగాడుతున్న విషయం తెలిసిందే.
ఏపీకే చెందిన తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నప్పటికీ- కోట్లాది మంది తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, ఇలవేల్పు శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం మీదుగా విమానాల రాకపోకలకు తెరపడట్లేదు.
తిరుమల గగనతాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పలుమార్లు కింజరాపు రామ్మోహన్ నాయుడికి చెందన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోవట్లేదనడానికి తాజాగా ఉదాహరణే ఈ ఘటన.
తిరుమలలో పదే పదే ఆగమ శాస్త్రాలు, ఆలయ సంప్రదాయాల ఉల్లంఘన జరుగుతోండటం అరిష్టానికి దారి తీస్తుందంటూ శ్రీవారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగువాడే అయినప్పటికీ- ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నారో తెలియట్లేదంటూ వాపోతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన అవసరం కేంద్రంపై ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications