ఏపీ మరో ఘనత: సరకు రవాణాలో ఏపీ పోర్టులకు దేశంలో రెండో స్థానం!
ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టులు సరకు రవాణాలో దేశంలో మరో అడుగు ముందుకు వేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పోర్టుల ద్వారా సుమారు 210 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా జరిగింది. ఇది 2024-25తో పోలిస్తే దాదాపు 12 శాతం వృద్ధిగా నమోదైంది. నాన్-మేజర్ పోర్టుల సరకు రవాణాలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో నిలిచింది.
ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. విశాఖపట్నం మేజర్ పోర్టు, గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కృష్ణపట్నం, కాకినాడ యాంకరేజ్, రవ్వ వంటి నాన్-మేజర్ పోర్టుల కలిపి సామర్థ్యం ఏటా సుమారు 327.5 ఎంఎంటీలుగా ఉంది. అయితే ప్రస్తుతం దీనిలో 64 శాతం మాత్రమే వినియోగమవుతోంది. దీన్ని మరింత పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

విశాఖపట్నం పోర్టు ఒక్కటే 2025-26లో 91.17 ఎంఎంటీల సరకు రవాణా చేసింది. గతేడాది ఇది 82.62 ఎంఎంటీలుగా ఉండగా 10.35 శాతం పెరుగుదల నమోదైంది. నాన్-మేజర్ పోర్టుల ద్వారా 118.83 ఎంఎంటీలు రవాణా కాగా, గతేడాది కంటే 14.51 ఎంఎంటీలు అధికంగా ఈ ఏడాది రవాణా అయ్యింది.షిప్ ల టర్న్ అరౌండ్ సమయం తగ్గించడం, పోర్టు సౌకర్యాలు మెరుగుపరచడం, ఆధునిక యంత్రాలు వినియోగం ఈ వృద్ధికి దోహదపడ్డాయి.
విశాఖపట్నం పోర్టు దేశంలోని మేజర్ పోర్టుల్లో నాలుగో స్థానంలో, తూర్పు తీర పోర్టుల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవలి ఆర్థిక సంవత్సరంలోనే రోజుకు 5.33 లక్షల టన్నుల రికార్డు కూడా సాధించింది. కృష్ణపట్నం పోర్టు కూడా గతేడాది 59.22 ఎంఎంటీలు హ్యాండిల్ చేసి మంచి పనితీరు చూపింది.రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మారిటైం పాలసీ రూపొందించి నాన్-మేజర్ పోర్టుల సామర్థ్యాన్ని 191 ఎంఎంటీల నుంచి 285 ఎంఎంటీలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలో నిర్మాణంలో ఉన్న కొత్త పోర్టులు పూర్తయితే మరో 109 ఎంఎంటీల సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. 2026-27లో కార్గో రవాణాను రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నారు. కాకినాడను అంతర్జాతీయ లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేసి రోడ్లు, రైళ్లు, జలమార్గాలతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పెరుగుదల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి గొప్ప ఊతంగా కనిపిస్తుంది. పారిశ్రామిక ముడిసరుకులు, బొగ్గు, ఎరువులు, ఇనుప ఖనిజాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం కావడంతో ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో కొత్త పోర్టులు పూర్తయి సామర్థ్యం పెరిగితే దేశంలోని నాన్-మేజర్ పోర్టుల్లో ఏపీ వాటా 20 శాతానికి చేరుకోవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
