ఉల్లాసంగా.. ఉత్సాహంగా: మనవడితో ఆడి పాడిన చంద్రబాబు
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్‌తో కాసేపు సరదాగా కాలక్షేపం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఉండటం, మనవడు దేవాన్ష్ హైదరాబాద్‌లో ఉండటంతో మనవడిని చంద్రబాబు కలవడం కుదరడం లేదు.
అయితే ఆదివారం రాత్రి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు మనవడిని ఆడిస్తూ గడిపారు. జూబ్లీహిల్స్‌లోని తమ పాత ఇంటి స్థానంలో కడుతున్న కొత్త ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో చంద్రబాబు కుటుంబం ఇక్కడ ఎన్టీఆర్ భవన్ సమీపంలోని పార్క్ హయత హోటల్‌లో పైన ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే.
చంద్రబాబు కూడా వారితో పాటు అక్కడే ఉన్నారు. ఆదివారం రాత్రి మనమడిని ఎత్తుకొని తిప్పిన ఆయన సోమవారం ఉదయం తన భార్య భువనేశ్వరి, మనవడితో కలిసి హోటల్ ఆవరణలో కొద్దిసేపు మార్నింగ్ వాక్ చేశారు. మనవడికి అల్పాహారం కూడా తినిపించారు. ఈ సందర్భంగా మనవడితో ఆడి పాడిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అనంతరం సోమవారం ఆయన పదకొండు గంటలకు బయలుదేరి ఇక్కడి లేక్‌వ్యూ అతిథి గృహానికి చేరుకుని, మళ్లీ అధికారిక విధుల్లో మునిగిపోయారు. లేక్‌వ్యూలో తెలంగాణ నేతలతో భేటీ అయిన చంద్రబాబు, తాను ఈసారి హైదరాబాద్‌కు అనుకోకుండా వచ్చానని చెప్పారు.
''అధికారిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతి వెళ్లాను. సోమవారం రాత్రికి స్వామివారికి పట్టువస్త్రాలు ఇవ్వాల్సి ఉన్నందున అక్కడే ఉండి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని వద్దామని అనుకొన్నాను. కానీ వేరే పని కోసం వచ్చి స్వామివారి వద్దకు రాకూడదని, పండితులు చెప్పారు. దీంతో తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చి ఒక రాత్రి ఇక్కడ ఉండి ఈరోజు నా భార్యతో కలిసి తిరుమలకు వెళ్తున్నాను'' అని వివరించారు.












Click it and Unblock the Notifications