ఏపీలో హాస్టల్స్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్!
ఆంధ్రప్రదేశ్‌లో హాస్టల్ విద్యార్థులకు మంచి శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వారి డైట్ ఛార్జీలను పెంచింది. అలాగే కొత్త పోషకాహార మెనూను కూడా ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పెంపు వర్తిస్తుంది.
మూడో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు నెలకు రూ.1,150 నుంచి రూ.1,265కు డైట్ చార్జీలు పెంచారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.1,400 నుంచి రూ.1,540కు డైట్ ఛార్జీల పెంపు జరిగింది. ఇంటర్ మరియు అంతకు పై తరగతుల విద్యార్థులకు రూ.1,600 నుంచి రూ.1,760కు పెంచారు. ప్రభుత్వం కేవలం ఛార్జీలు పెంచడమే కాకుండా మెనూను కూడా మార్చింది.

ఇకపై వారంలో ఆరు రోజులు గుడ్లు అందించనున్నారు. వారంలో మూడు రోజులు చికెన్ ఇస్తారు. ప్రతిరోజూ పాలు, పండ్లు అందుబాటులో ఉంటాయి. కొత్త మెనూలో చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ, పులిహోర, ఇడ్లీ, ఉప్మా, పొంగల్, రాగి లడ్డూ, మల్టీ మిల్లెట్ చిక్కీలు వంటి పోషకాహార పదార్థాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల హాస్టల్ విద్యార్థులకు మెరుగైన పోషకాహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు ఇది నిజంగా వారి పోషకాహార అవసరాలను తీర్చే నిర్ణయంగా చెప్పొచ్చు. విద్యార్థులకు కావాల్సిన పోషకాహారం అందితే ఆరోగ్యంగా ఉండి చదువుపై దృష్టి పెట్టే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా విద్యార్థులకు మద్దతు ఇస్తోంది. ఈ డైట్ ఛార్జీల పెంపు నిజంగా ఏపీలో వివిధ ప్రభుత్వ హాస్టల్స్ లో చదివే విద్యార్థులకు సూపర్ న్యూస్.
డైట్ ఛార్జీలు పెంచిన వేళ హాస్టల్ సూపరింటెండెంట్లు, వంట సిబ్బంది కొత్త మెనూను సరిగా అమలు చేసేలా చూడాలని అధికారులు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంఘాలు ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశాయి. పోషకాహారం మెరుగవడంతో పిల్లల ఆరోగ్యం, చదువు రెండూ బాగుంటాయని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య హాస్టల్ విద్యార్థులకు నిజంగా శుభవార్తగా మారింది.












Click it and Unblock the Notifications
