ప్రీమియం మద్యం సిద్దం: కొత్త స్టోర్లు-ధరలు, మార్గదర్శకాలు..!!
ఏపీలో ప్రీమియం మద్యం కోసం కొత్తగా ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా ఈ స్టోర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనూ ఈ షాప్స్ అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా ఇప్పటికే బార్లు - మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. మద్యం ప్రీమియం బ్రాండ్ల అమ్మకాల కోసం రాష్ట్రంలో 12 స్టోర్ల కు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసారు.
ప్రీమియం స్టోర్లు ఏర్పాటు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిం ది. రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. బెల్టు షాపులు ఏర్పాటు అంశం పైన ప్రభుత్వం సీరియస్ అయింది. మద్యం దుకాణాల పరిధిలో బెల్టు షాపులు.. ఎమ్మార్పీ ధరల విషయంలో ప్రభుత్వ సీరియస్ అయింది. మద్యం దుకాణాలకు హెచ్చరిక చేసింది. అదే విధంగా గత ప్రభుత్వంలో అందుబాటులో లేకుండా పోయిన బ్రాండెడ్ మద్యాన్ని ప్రస్తుతం వినియోగం లోకి తీసుకొచ్చింది. కొత్త మద్యం దుకాణాల ప్రారంభం నుంచి రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనసాగుతున్నాయి.

మార్గదర్శకాలు
ఇక, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాల కోసం కొత్తగా ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టోర్ల ఏర్పాటుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్రంలోని నగరాలు, మున్సిపల్ కార్పోరేషన్లలో12 ప్రాంతాల్లో ఈ ప్రీమియం స్టోర్లు అందుబాటు లోకి రానున్నాయి. వీటికి దరఖాస్తు రుసుము రూ.15 లక్షలుగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఖరారు చేసారు. వీటికి సంబంధించిన దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చని వెల్లడిం చారు. ఈ ప్రీమియం స్టోర్ల లైసెన్స్ ఫీజు కింద ఏడాదికి రూ.కోటి చెల్లించాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ కోటి ఫీజు
అదే విధంగా లైసెన్స్ ఫీజు పై ఏటా 10శాతం చొప్పున ఫీజు పెరుగుతుందని అధికారులు స్పష్టం చేసారు. కాగా, ఈ ప్రీమియం స్టోర్లకు ఒకే సారి అయిదేళ్లు కాలానికి లైసెన్సులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా స్టోర్ల ఏర్పాటుకు వీలుగా కొన్ని మార్గదర్శకాలు ఖరారు చేసారు. ఈ స్టోర్లు ఏర్పాటు చేయాలంటే కనీసం 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం చూపించినవారే దరఖాస్తు చేయడానికి అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తులు పరిశీలించి లైసెన్స్ ఖరారు కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. అదే విధంగా సాధారణ మద్యం దుకాణాలు కొనసాగే వేళల్లోనే ప్రీమియం స్టోర్లలో లిక్కర్, బీరు, వైన్‌తో పాటు లిక్కర్ చాక్లెట్లు, సిగార్స్, సిగరెట్లు విక్రయానికి అనుమతులు ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications