ఏపీలో డ్వాక్రా మహిళలకు మరో గుడ్ న్యూస్- 48 గంటల్లోనే 3 లక్షలు..!
ఏపీలో డ్వాక్రా మహిళల్ని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం (AP Govt).. ఇందులో భాగంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా 'స్త్రీనిధి ఆంధ్రప్రదేశ్' ద్వారా ప్రత్యేక మహిళా పారిశ్రామికవేత్తల రుణ పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన ప్రతి స్వయం సహాయక సంఘం మహిళకు రూ.3 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఒక్కో స్వయం సహాయక సంఘం నుంచి గరిష్టంగా ముగ్గురి చొప్పున అవకాశం ఉంటుందన్నారు.
ప్రతీ డ్వాక్రా మహిళకూ 48 గంటల్లోనే గరిష్టంగా 3 లక్షల వరకూ రుణం మంజూరు అవుతుందని, వడ్డీ కూడా యేడాదికి 11 శాతం మాత్రమే అని మంత్రి కొండపల్లి తెలిపారు. డిజిటల్, బయోమెట్రిక్ ప్రక్రియతో పాటు 2024-25 నుంచి 8 అక్టోబర్ 2026 వరకు సుమారు 17.96 లక్షల మంది మహిళలకు రూ.14,467.12 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. డిజిటల్ విధానంలో రూ.4,443.13 కోట్లు వసూలు కాగా.. గ్రామ సంస్థల కోసం రూ.6 కోట్ల విలువైన 30,000 బయోమెట్రిక్ పరికరాల పంపిణీ చేశామన్నారు. 98 శాతంతో ఆదర్శవంతమైన రికవరీ రేటు కూడా నమోదైందని మంత్రి స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.17 లక్షలకు, గ్రామ సంస్థల పరిమితిని రూ.1.50 కోట్లకు పెంచామన్నారు.

పిల్లల చదువులు, పెళ్లళ్లకు 4 శాతం వడ్డీ రాయితీతో విద్యా, వివాహ రుణాలు మంజూరు చేయడంతో పాటు PMFME పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సబ్సిడీ రుణాలు, గిరిజన ప్రాంతాల మహిళలకు ప్రత్యేక స్వల్పకాలిక రుణాలు అందిస్తామన్నారు. 2026-27 సంవత్సరపు ఆర్థిక లక్ష్యంలో ఏకంగా రూ.3,000 కోట్లను కేవలం మహిళా పారిశ్రామికవేత్తల రుణాల కోసమే కేటాయించినట్టు మంత్రి పేర్కొన్నారు. రుణగ్రహీత మరణిస్తే కుటుంబానికి ఆసరాగా లోన్ ప్రొటెక్షన్ , ప్రమాదవశాత్తు మరణ సహాయ పథకం వర్తిస్తుందన్నారు. మహిళా సాధికారత, పారిశ్రామికాభివృద్ధి, డిజిటల్ ఆర్థిక భాగస్వామ్యానికి 'స్త్రీనిధి'ని ఒక ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
