ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామాలు-ఈడీ తాజా షాక్..!
ఏపీలో గత వైసీపీ హయాంలో జరిగిందని భావిస్తున్న మద్యం స్కాం (ap liquor scam)లో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ రిపోర్టుల ఆధారంగా కేసులు నమోదు చేసిన ఈడీ.. ఇవాళ పలువురు కీలక నిందితులకు భారీ షాకిచ్చింది. వారి ఆస్తుల్ని భారీ ఎత్తున జప్తు చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ స్కాం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.
మద్యం స్కాంపై విచారణ జరుపుతున్న హైదరాబాద్ ఈడీ విభాగం... ఇవాళ ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, బూనేటి చాణక్య, వాసుదేవరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు, అలాగే అనుబంధ సంస్ధలకు చెందిన మొత్తం రూ.441 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం స్కాంలో షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా రూ.104 కోట్ల ప్రభుత్వ ధనాన్ని వీరు కొల్లగొట్టినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో నిందితుల బ్యాంక్ ఖాతాలతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ లు, ఫిక్సెడ్ డిపాజిట్లు, భూములు కూడా ఉన్నాయి. ఈ స్కాంలో ప్రభుత్వానికి రూ.4,000 కోట్ల నష్టం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసినట్లు గుర్తించిన ఈడీ.. పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించినట్లు కూడా గుర్తించింది. అలాగే ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో గుర్తించారు. ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం వరకు మామూళ్లు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అలాగే కమిషన్ ఇవ్వని కంపెనీలకు సప్లె ఆర్డర్లు నిలిపివేసినట్లు ఈడీ గుర్తించింది.












Click it and Unblock the Notifications