బొత్స "అమరావతి స్మశానం" వ్యాఖ్యలపై మంత్రి మేరుగ వివరణ..
ఏపీలో అమరావతి ఆర్ 5 జోన్ వివాదం కాకరేపుతోంది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చేందుకు ఆర్ 5 జోన్ ఏర్పాటు చేయడమే కాకుండా దీనిపై కోర్టుల్లోనూ పోరాడి విజయం సాధించిన వైసీపీ సర్కార్ ఇప్పుడు విపక్షాలపై గురిపెడుతోంది. ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తున్న మంత్రులు.. గతంలో అమరావతిని స్మశానం అంటూ చేసిన వ్యాఖ్యలపైనా వివరణ ఇస్తున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి రాజధాని మొత్తాన్ని శ్మశానమని అనలేదని మరో మంత్రి మేరుగు నాగార్జున ఇవాళ వివరణ ఇచ్చారు. మంత్రి శ్మశానమని ఏ ఆలోచనలతో ఏం మాట్లాడారో అన్నది ఒక ఎత్తు అయితే చంద్రబాబు డెమోగ్రాఫికల్ సమతుల్యత ఇబ్బంది అవుతుందని చంద్రబాబు అన్నది మరో ఎత్తని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఆర్ 5 జోన్ లో ఇళ్లస్థలాలు ఇచ్చే వారంతా ఈ ప్రాంత లబ్దిదారులే అన్నారు. ఇక్కడి నుంచే విజయవాడ -గుంటూరు ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఇక్కడ ఇళ్లస్థలాలు పొందే లబ్దిదారులంతా రాత్రిపూట ఇక్కడే నివాసం ఉంటున్నారన్నారు.

పేదలకు ఇంటి జాగా ఇవ్వడంపై స్వయంగా సుప్రీంకోర్టు మొట్టికాయలేసినా కూడా... చంద్రబాబు పెత్తందారీ ఫ్యూడలిజం మనస్తత్వంలో ఎక్కడా మార్పు రాలేదని మంత్రి ఆరోపించారు. సుప్రీం తీర్పుపైన, పేదలకు మా ప్రభుత్వం ఇళ్లు ఇవ్వడంపైనా తన ఎల్లో గ్యాంగ్ తో ఏదోరకంగా మాట్లాడిస్తూనే ఉన్నాడన్నారు.. ఆయన కూడా ఏమాత్రం సిగ్గూ, ఎగ్గు లేకుండా పేదల పట్ల ఆయన వ్యతిరేక భావజాలాన్ని తెలియజేస్తూనే ఉన్నాడని విమర్శించారు. చివరికి నిన్న పెందుర్తి సభలో బాబు అహంకారం వెర్రితలలేసిందని, పేదవాళ్లకు ప్రభుత్వం ఇచ్చే భూమిని సమాధులతో పోల్చాడన్నారు. ఈ మాట మాట్లాడటానికి ఆయనకు నోరెలా వచ్చింది.. ఏంటి, నీ అహంకారం..? మీ పెత్తందారీ మదం నెత్తికెక్కిందా..? అని ప్రశ్నించారు.
పేదవారిని, బడుగుల జీవితాలను హేళన చేస్తూ, అనేక సందర్భాల్లో తూలనాడి.. ఆఖరికి పేదవాళ్ల ఇంటి స్థలాన్ని సమాధులతో పోల్చిన చంద్రబాబును ఎక్కడికెళ్లినా పేదలంతా నిలదీయమని మంత్రి మేరుగు పిలుపునిచ్చారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో, ఇన్నాళ్లూ పేదల పట్ల, బడుగుల పట్ల ప్రదర్శించిన నిరంకుశమైన ఆలోచనసరళికి తగిన సమాధానం చెప్పిన తర్వాతనే, ఆయన పేదల పల్లెల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications