ఏపీ సర్కార్ కు ముస్లింల షాక్- ఎక్కడికక్కడ ఇఫ్తార్ విందుల బాయ్ కాట్..!
కేంద్రం పార్లమెంట్ లో తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఎన్డీయే మిత్రపక్షం టీడీపీ మద్దతిస్తున్నందుకు నిరసనగా అఖిల భారత ముస్లిం లాబోర్డు పిలుపు మేరకు ఎక్కడికక్కడ ఇఫ్తార్ విందుల్ని ముస్లింలు బహిష్కరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతీ జిల్లా కేంద్రాల్లోనూ రంజాన్ సందర్భంగా ఇస్తున్న ఇఫ్తార్ విందులు ముస్లింలు రాక వెలవెలబోతున్నాయి. దీంతో టీడీపీకి చెందిన ముస్లిం నేతలు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.
ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు పిలుపు మేరకు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ఇస్తున్న ఇఫ్తార్ విందు బహిష్కరణలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విజయవాడతో పాటు పలు చోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందుల్ని పలు చోట్లముస్లింలు బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు కూటమి ప్రభుత్వం మద్దతు ఉపసంహరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనలు ఉద్యమం చేపట్టాయి. నిన్న శుక్రవారం మసీదులకు నల్ల రిబ్బన్లతో హాజరై నిరసన తెలపాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ల బోర్డు పిలుపు సఫలీకృతం అయింది.

ఈ సందర్భంగా ఏలూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లింలు గైర్హాజరు అయ్యారు. ఏలూరు లో గిరిజన భవన్ లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లింలు గైర్హాజరు అయ్యారు. జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్, టిడిపి నాయకులు అక్బర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్ లో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా జోక్యాన్ని ముస్లింలు సహించరని అందుకే ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించినట్లు కలెక్టర్ వెట్రి సెల్వికి తెలిపారు. ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి తాము 10 మంది వచ్చామని చెప్పారు.

ఎక్కడ జరిగిన పరిణామాన్ని మీరు సీఎం దృష్టికి తీసుకు వెళ్లాలని టీడీపీ నేతలు కలెక్టర్ ను కోరారు. ఇదే పరిస్థితి దేశ, రాష్ట్రవ్యాప్తంగా నెలకొని ఉందని అన్నారు. ముస్లింల సంక్షేమానికి పుణ్యం కోసం ఇచ్చిన భూములపై ప్రభుత్వాల పెత్తనం సరైనది కాదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వెట్రి సెల్వి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications