పేర్లు మార్పు.. వైఎస్ చంద్రబాబు, నారా జగన్??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో నేమ్ గేమ్ కొనసాగుతుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన పథకాల పేర్లను మళ్లీ మారుస్తున్నారు. టిడిపి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఏపీ పథకాలపై కొనసాగుతున్న నేమ్ గేమ్ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబు పేరు ఎక్కడా వినపడకూడదని జగన్
2019 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు పాలన పోయి జగన్ పాలన వచ్చిన తర్వాత జగన్ పథకాలపై తన మార్క్ ఉండేలా పేరు మార్పు చేశారు. చంద్రబాబు పేరు ఎక్కడా వినపడకూడదని నిర్ణయం తీసుకుని, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్సార్ విద్యోన్నతి, జగనన్న విదేశీ విద్యా దీవెన, వైయస్సార్ ఆరోగ్యశ్రీ ఇలా ప్రభుత్వ పథకాలకు వైఎస్ఆర్ పేరు, జగన్ పేరు పెట్టుకున్నారు.

జగన్ పథకాల పేర్లు మార్చిన చంద్రబాబు
గతంలో ఉన్న కొన్ని పథకాలకు పేర్లు మార్చి, కొత్త పథకాలను తీసుకువచ్చిన జగన్ ప్రతి పథకంలోనూ తన మార్కు ఉండేలాగా తన పేరు తన తండ్రి పేరు ఉండేలాగా చూసుకున్నారు. మొదటినుంచి పథకాల పేర్లు మార్పుపై జగన్ వ్యవహర శైలిని వ్యతిరేకించిన చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న పథకాల పేర్లను మళ్ళీ యధావిధిగా మార్చేశారు.
ప్రస్తుతం పథకాల పేర్లు ఇలా
అంతకుముందు టీడీపీ హయాంలో ఉన్న పేర్లనే మళ్ళీ మార్పు చేశారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యా దీవెన పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, అమ్మ ఒడి పథకాన్ని, తల్లికి వందనంగా, వైయస్సార్ ఆరోగ్యశ్రీని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా పేర్లు మార్చారు.
ఏపీ వాసులలో విస్మయం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలపై అటు జగన్, ఇటు చంద్రబాబు ఆడుతున్న నేమ్ గేమ్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రజలకు ఇచ్చే పథకాలకు ఇలా ఎవరికి వారు తమ మార్కు ఉండేలా పేర్లు పెట్టుకోవడం ఏపీ వాసులను విస్మయానికి గురిచేస్తుంది. ఎవరికి వారు గత ప్రభుత్వ పాలన తాలూకా గుర్తులు ఉండకూడదని భావిస్తూ పేర్లు మార్చటంపైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారని ఏపీ వాసులు భావిస్తున్నారు.
పథకాలపై రాజకీయ చదరంగం
ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారుస్తూ నేమ్ గేమ్ ఆడటం మంచిది కాదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు పాలన సాగించే వారి పేరు మీద పథకాలు పెట్టకుండా చూడాలని, పథకాలను కూడా రాజకీయ చదరంగంలో పావులుగా మార్చటం మంచిది కాదంటున్నారు. జగన్, చంద్రబాబుల పేర్లు వైఎస్ చంద్రబాబు, నారా జగన్ అంటే ఎలా ఉంటుందో... ఊరికే పథకాల పేర్లు మారిస్తే అలాగే ఉంటుందంటున్నారు ఏపీ ప్రజలు.












Click it and Unblock the Notifications