ఏపీని వీడని భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
ఏపీని వర్షాలు వీడటం లేదు. వరుస అల్పపీడనాలతో వర్షాలు కొనసాగుతున్నాయి. దాదాపు 15 రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరోసారి ఏపీలోని పలు జిల్లాలను అలెర్ట్ చేసింది. ఈ నెల 15వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది. దీంతో, ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. రైతులకు పలు సూచనలు చేసింది. నేటి నుంచి వారం రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.
ఈ జిల్లాల్లో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15వ తేదీ వరకూ వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోందని.. వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో 11వ తేదీన రాయలసీమలో విస్తారంగా, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కోస్తా, రాయ లసీమలో ఎక్కువ ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి ఉన్నాయి. అక్కడక్కడా వర్షాలు కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు.

తాజా అంచనాలు
ఇక, రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత అంచనాల మేరకు ఈ నెల 15వ తేదీ వరకు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇటు వర్షాల హెచ్చరికతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. జిల్లాల అధికారులకు కీలక సూచనలు చేసింది. జిల్లాల్లో కోసిన ధాన్యాన్ని తక్షణం రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించింది. కళ్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.
మరో అల్పపీడనం
ప్రస్తుత అల్పపీడనంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ మరో కీలక సమాచారం వెల్లడించింది. రానున్న నాలుగు రోజుల్లో శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు తీర ప్రాంతాల్లో అలలు కూడా తీవ్రంగానే ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఈ నెల 14 లేదా 15వ తేదీల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐరోపాకు చెందిన వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇది 16, 17వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీలో కొద్దిరోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో, వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో ఏపీని చలి కాలంలోనూ వర్షాలు వదిలే అవకాశం కనిపించటం లేదు.












Click it and Unblock the Notifications