మహిళలకు ఉచిత ప్రయాణం ఈ బస్సుల్లోనే - ఇవి తప్పనిసరి, మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సమాయత్తం అవుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. అయిదు రకాల బస్సుల్లో ఈ పథకం అమలుకు నిర్ణయించారు. టికెట్ల పైనా నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చేసిన ప్రతిపాదనల మేరకు మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం తుది నిర్ణయానికి ఆమోదం తెలపనుంది.
ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ పథకంలో భాగంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ లోని పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో జీరో ఫెయిర్ టికెట్ తో ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. ఆర్టీసీ అధికారులు ఈ పథకం అమలు పైన తుది నివేదిక సిద్దం చేసారు. బస్సులు, డ్రైవర్ల ఖరారు.. కండక్టర్లకు శిక్షణ పైన ఫోకస్ చేసారు. సంస్థలో 11,449 బస్సులు ఉండగా, అందులో పల్లెవెలుగు, అల్ట్రాపల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు అన్నీ కలిపి 8,548 (74 శాతం) ఉన్నాయి. పథకం అమలులో ఇవే కీలకం కానున్నాయి.

సాధారణంగా ప్రతి డిపోలో కొన్ని బస్సులు స్పేర్ కింద పక్కన ఉంచిన బస్సులను ఈ పథకం కోసం రోడ్డు ఎక్కనున్నాయి. పథకం మొదలయ్యాక తొలి మూడు నెలలు అధిక రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎక్కువ మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తార ని, దీనివల్ల అన్ని బస్సుల్లో రద్దీ పెరగనుందని భావిస్తున్నారు. దీంతో డ్రైవర్లు, కండక్టర్లకు అధికారులు తగిన సూచనలు చేస్తున్నారు. రద్దీ సమయంలో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసినా సహనంగా వ్యవహరించాలని పేర్కొంటున్నారు. ఉచిత ప్రయాణం అమలు ఉన్న బస్సుల్లో మహిళలకు వేరుగా జీరో టికెట్లు ఇవ్వనున్నారు. మగవారికి సాధారణ టికెట్లు, మహిళలకు జీరో టికెట్లు ఇస్తారు.
బస్సులో భర్త, భార్య ప్రయాణిస్తే భర్తకు ఛార్జీ ఉండే టికెట్, భార్యకు జీరో టికెట్ రెండూ వేర్వేరుగా జారీ చేస్తారు. 6న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ స్కీం గురించి నిర్ణయం తీసుకొని అధికారికంగా విధివిధానాలు ప్రకటించనున్నారు. ఏపీకి చెందిన మహిళలకే ఈ పథకం అమలు కానుంది. ప్రభుత్వం నిర్ధారించిన ఏదైనా గుర్తింపు కార్డుతో బస్సుల్లో ఈ పథకం వినియోగానికి అవకాశం కల్పించారు.












Click it and Unblock the Notifications