ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం - ముందుగా ఈ మార్గాల్లో ప్రారంభం..!!
ఏపీలో ఉచిత బస్సు పథకం కొనసాగుతోంది. పథకం వినియోగించుకునే మహిళల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కొన్ని సర్వీసుల వరకే ఈ పథకం పరిమితం చేసారు. కొంత కాలంగా చెబుతున్న విధంగా ఇప్పుడు ఏసీ బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం ప్రారంభించారు. విశాఖ కేంద్రంగా ఈ పథకాన్ని ఏసీ బస్సుల్లో మొదలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏసీ బస్సులు దశల వారీగా అందుబాటులోకి రానున్నాయి. ఏసీ బస్సులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనూ స్త్రీశక్తి పథకం అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
రాష్ట్రానికి కేటాయించిన కొత్త ఎలక్ట్రిక్ ఏసీ మెట్రో బస్సులు విశాఖలో అందుబాటులోకి వచ్చాయి. విశాఖలో 30 బస్సులు గాజువాక, ఆర్కే బీచ్, జగదాంబ, ఎన్‌ఏడీ, పెందుర్తి, స్టీల్‌ప్లాంట్ తదితర ప్రాంతాలను కలుపుతూ ఈ బస్సులు నడవనున్నాయి. స్త్రీశక్తి పథకం కింద అర్హులైన మహిళలకు ఈ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం వర్తిస్తుంది. పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఈ బస్సుల వల్ల డీజిల్ వినియోగం తగ్గడంతో పాటు వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఉండదని అధికారులు చెబుతున్నారు.

సింథియా నుంచి గాజువాక, ఎన్‌ఏడీ మీదుగా పెందుర్తి వరకు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్, సింథియా, గాజువాక, స్టీల్‌ప్లాంట్ ప్రాంతాలను కలిపే మార్గంలోనూ ఈ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ప్రయాణానికి సాధారణ బస్సుల కంటే కొంత ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, సాధారణ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.10 ఉండగా, ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ.15గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి 750 ఏసీ బస్సులు మంజూరయ్యాయి. గాజువాక డిపో పరిధిలో ఇప్పటికే భోగాపురం విమానాశ్రయానికి 20 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. నగరం లోని ఇతర మార్గాల్లోనూ కొత్త బస్సుల సేవలను విస్తరించేందుకు ఈ బస్సులను వినియోగించే ఆలోచన చేస్తున్నారు.
అయితే, పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటు లోకి తెచ్చేందుకు కసరత్తు కొనసాగుతోంది. దశల వారీగా బస్సులు డిపోల వారీగా కేటాయింపు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి బస్సులు వస్తాయని చెబుతున్నారు. దీంతో, ఇక స్త్రీ శక్తి పథకం ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అమలు కానుంది.














Click it and Unblock the Notifications
