Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి తుఫాను ముప్పు!
అరేబియా సముద్ర నైరుతి భాగంలో కేంద్రీకృతమైన వాతావరణ వ్యవస్థ మరింత బలపడుతోంది. ఇవాళ ఉదయం నాటికి నైరుతి అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం తూర్పు దిశగా కదిలి, రాగల 24 గంటల్లో వాయుగుండం బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ఈ వ్యవస్థ ప్రారంభంలో ఈశాన్య దిశగా కదిలి, ఆ తర్వాత క్రమంగా వాయవ్య దిశగా సోమాలియా తీరం వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్‌సాట్-3డీఎస్ (INSAT-3DS) ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ సముద్ర తుఫాను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదన్న వాతావరణ శాఖ
అరేబియా సముద్రంలో ఈ వాతావరణ కల్లోలం తీవ్రరూపం దాల్చుతున్నప్పటికీ, దీనివల్ల భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదని, వర్షాల ప్రభావం కూడా ఉండదని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ పూర్తిగా సోమాలియా తీరం వైపు పయనిస్తుండటంతో మన దేశానికి ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే అరేబియా సముద్రంలో మాత్రం రాగల రెండు మూడు రోజులు వాతావరణం అత్యంత క్షీణదశలో ఉండే అవకాశముంది.

భారీ ఈదురుగాలులు.. మత్స్యకారులకు హెచ్చరిక
ఈ వాతావరణ మార్పుల కారణంగా నైరుతి అరేబియా సముద్రంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. అక్టోబర్ 23 వరకు సోమాలియా తీరం, సొకోట్రా ద్వీప ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనుండటంతో అక్టోబర్ 23 వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
బంగాళాఖాతంలో తుఫాను ముప్పు?
ఇదిలా ఉండగా, నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, అక్టోబర్ 24, 25 తేదీల్లో అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని, అది అక్టోబర్ 27 నాటికి వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నెలాఖరు నాటికి ఇది తుఫాన్‌గా రూపాంతరం చెంది ఉత్తర కోస్తా - దక్షిణ ఒడిశా తీరాల మధ్య దాటే ఛాన్స్ ఉందని భావిస్తుండగా, దీనిపై మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది.














Click it and Unblock the Notifications
