కడపలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ-ఈ 13 జిల్లాల వారికే-తేదీలు, పూర్తి వివరాలు..!
ఏపీలో త్వరలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగబోతోంది. రాష్ట్రంలోని కడపలో ఈ అర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహణకు వీలుగా నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఆర్మీ రిక్రూట్ మెంట్ కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో ఏయే జిల్లాల వారు పాల్గొనవచ్చు, అర్హతలు, రిక్రూట్ మెంట్ జరిగే తేదీలు, ఇతర వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

కడపలోని జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ (డీఎస్ఏ) స్టేడియంలో నవంబర్ 10 నుంచి 15 వరకూ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగబోతోంది. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలకు ఇందులో రిక్రూట్ మెంట్ జరుగుతుంది. ట్రేడ్స్ మెన్ పోస్టుకు 8వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. మిగతా ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులు.
కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల అభ్యర్ధులకు ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగబోతోంది. www.joinindianarmy.nic.in వెబ్ సైట్లో ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో దరఖాస్తు చేసుకున్న వారికి అడ్మిట్ కార్డులు పంపుతున్నారు. ఇలా అడ్మిట్ కార్డులు వచ్చిన వారు ర్యాలీకి హాజరుకావాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి ప్రలోభాలకు అభ్యర్ధులు లోను కావొద్దని ఆర్మీ అధికారులు అభ్యర్ధులకు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications