పార్టీ విస్తరణ కోసం కెసిఆర్ కేబినెట్లో నో: అసద్ చక్రం
హైదరాబాద్: తెరాస ఏర్పాటు చేయనున్న తొలి ప్రభుత్వంలో చేరేందుకు మజ్లిస్ నేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు ఆసక్తి చూపడం లేదు. విస్తృత రాజకీయ ప్రయోజనాల కోసమే కెసిఆర్ నాయకత్వంలోని సర్కారులో భాగం కావడం కన్నా బయటి నుంచే చక్రం తిప్పాలన్న వ్యూహంతో ఉన్నట్లు భావిస్తున్నారు.
ముఖ్యంగా సీమాంధ్రలో పార్టీ విస్తరణకు కృషి చేయనున్న తరుణంలో తెరాస జతగా ప్రభుత్వంలో చేరడం ప్రతిబంధకం కాగలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నీడలో మజ్లిస్ తన కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చింది. అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌తో అవసరానికి అనుగుణంగా సంబంధాలు సాగిస్తూనే తెలంగాణతోపాటు సీమాంధ్రలో మజ్లిస్‌ను బలోపేతం చేసుకునేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు.

అలాగే కర్ణాటక, మహారాష్ట్రలకూ మజ్లిస్‌ను విస్తరించి, రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల సమన్వయంతో పోటీకి భారీ సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గతంలో ఎప్పుడూ లేనివిధంగా మజ్లిస్ విజయం సాధించింది.
కాబట్టి తెలంగాణకే పరిమితమైన తెరాస ప్రభుత్వంలో చేరితే భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తుండవచ్చునని అంటున్నారు. ఇక పుర, నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ మజ్లిస్ 101 వార్డులు, డివిజన్లలో విజయం సాధించింది. దీంతోపాటు నాలుగు జిల్లాల్లో 20 వరకు ఎంపీటీసీ స్థానాలను చేజిక్కించుకుంది. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్‌తో పాటు భావసారూప్యంగల పార్టీలతో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పంచుకోడానికీ సిద్ధమవుతోంది.
ఆదిలాబాద్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో మజ్లిస్ చైర్మన్ పదవి పొందనుంది. రంగారెడ్డి జిల్లా తాండూర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, నల్గొండ మునిసిపాలిటీల్లోనూ చైర్మన్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది.
తాండూరులో టిడిపి, కాంగ్రెస్‌లలో తమకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చే పార్టీకి మద్దతిచ్చేందుకు మజ్లిస్ సిద్ధంగా ఉంది. నిజామాబాద్‌లో ఇప్పటికే డిప్యూటీ మేయర్ పదవిని మజ్లిస్‌కు ఇవ్వటానికి తెరాస అంగీకరించిందని అంటున్నారు. మరోవైపు తెరాస ప్రభుత్వం ఏవైనా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే వాటికి తామూ బాధ్యత వహించాల్సి వస్తుందని భావిస్తోంది. అందుకే బయటి నుండి మద్దతివ్వడమే మంచిదని భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications