చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ? సుజనాకు క్లారిటీ ఇచ్చిన నడ్డా !
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో విపక్ష నేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ఈ అరెస్టుపై వెంటనే స్పందించేందుకు బీజేపీ ఇష్టపడకపోవడంతో ఈ అరెస్టు వెనుక ఆ పార్టీ పాత్ర ఉందన్న చర్చ పెరిగింది. ఇదే అంశాన్ని వైసీపీతో పాటు టీడీపీ కూడా ప్రచారంలోకి తెచ్చేశాయి. చంద్రబాబు అరెస్టు వ్యవహారం తమకు ఎక్కడ అంటుకుంటుందో అని వైసీపీ, కేంద్రం అండలేకుండా వైసీపీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోదని టీడీపీ భావించాయి.

దీంతో తాజాగా నారా లోకేష్ ను పిలిపించుకుని మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందులో బీజేపీ పాత్ర లేదని, కేంద్రం పాత్ర కూడా లేదని తేల్చిచెప్పేశారు. ఇవాళ ఇదే అంశంపై చర్చించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆ పార్టీ మాజీ ఎంపీ సుజనా చౌదరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఏపీలో తాజా పరిణామాలపై చర్చించుకున్నారు. ఇందులో చంద్రబాబు అరెస్టులో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం పాత్ర లేదనే విషయాన్ని జేపీ నడ్డా కూడా స్పష్టం చేశారు.

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసి ఏపీలోని రాజకీయ పరిణామాల మీద చర్చించినట్లు ఈ భేటీ అనంతరం సుజనా చౌదరి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు వెనుక బీజేపీ పాత్ర ఉందని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నడ్డా సూచించారని సుజనా తెలిపారు. అలాగే ఏపీలో జరుగుతున్న పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోందని నద్దా చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో బీజేపీ అనుసరించాల్సిన వైఖరి గురించి ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించినట్లు సుజనా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications