Bobbili assembly roundup: బొబ్బిలి యుద్ధంలో గెలిచేదెవరు?
విజయనగరం జిల్లాలోని కీలక నియోజకవర్గం బొబ్బిలి నియోజకవర్గం. బొబ్బిలి నియోజకవర్గం చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు. అటువంటి బొబ్బిలి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గం నుండి విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో మూడుసార్లు మాత్రమే గెలుపొందింది.
ఇక 2019 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో వైసిపి విజయం సాధించింది. ఈసారి బొబ్బిలిలో పాగా వెయ్యాలని అన్ని రాజకీయపార్టీలు బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయావకాశాలు ఉన్న నేతలను ఎన్నికల బరిలోకి దింపాయి. 2019 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వెంకట చిన అప్పలనాయుడు, సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సుజయ కృష్ణ రంగారావు పై విజయం సాధించారు.

ఇక ఈ దఫా బొబ్బిలి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడు కి మళ్లీ అవకాశం కల్పించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇక తెలుగుదేశం, బిజెపి , జనసేన ఉమ్మడి కూటమి నుండి, టిడిపి అభ్యర్థికి అవకాశం దక్కింది. తెలుగుదేశం పార్టీ నుండి బేబీ నాయన ఎన్నికల బరిలోకి దిగి ఈసారి అమీ తుమీ తేల్చుకోవడానికి రెడీ అయ్యారు.
జగన్ వేవ్ పైన నమ్మకంతో, జగన్ సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయి అన్న విశ్వాసంతో వైసిపి అభ్యర్థి వెంకట చిన్న అప్పలనాయుడు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే తాను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తనకు మళ్లీ పట్టం కడతాయని బలంగా నమ్ముతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన బేబీ నాయన ( వెంకట చలపతి రంగారావు) కు బొబ్బిలి రాజ కుటుంబ నేపథ్యం ఉండడం కొంత ప్లస్ గా కనిపిస్తుంది. ఎన్నికల్లో టికెట్ ప్రకటించక ముందు నుండి ప్రజల్లోకి జోరుగా వెళుతున్న ఈయన స్థానికంగా ప్రజల మద్దతును పొందుతున్నారు. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఆయన తెగ విశ్వాసంతో ఉన్నారు. ఏది ఏమైనా ఈసారి జరుగుతున్న బొబ్బిలి యుద్ధంలో విజయం ఎవరిని వరిస్తుంది అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.












Click it and Unblock the Notifications