మహిళల సెంటిమెంట్‌తో ఆడుకోవద్దు: బిజెపిపై బోండా, ఎలా సాధ్యమని గాలి

Subscribe to Oneindia Telugu

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమా, గాలి ముద్దుకృష్ణమనాయుడు కేంద్రంలోని బిజెపి సర్కారుపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. ప్రజల వద్ద వున్న బంగారం గురించిన లెక్కలు అడుగుతున్న కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ బుధవారం మండిపడ్డారు.

బంగారంతో మహిళలకు విడదీయరాని సంబంధం ఉందని, పాత బంగారం జోలికి వెళ్లడం తుగ్లక్ నిర్ణయమని విమర్శించారు. మహిళల సెంటిమెంట్ తో ఆడుకోవద్దని బీజేపీకి చెబుతున్నామన్నారు.

కాగా, ఐటీ చట్టసవరణ బిల్లులో బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినంలను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. 69 ఏ, 69 బి సెక్షన్ల ప్రకారం ఆభరణాల లెక్క కూడా చెప్పాల్సిందేనని, తరతరాల నుంచి వచ్చిన ఆభరణాలకైనా సరే, బిల్లులు చూపించాలని కేంద్రం పేర్కొంది.

bonda uma and gali fires at BJP

అమెరికాలోనే లేదు ఇక్కడెట్లా సాధ్యం: గాలి

పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. 'అమెరికాలోనే వందశాతం ఆన్ లైన్ లావాదేవీలు జరగట్లేదు, అలాంటప్పుడు, ఇండియాలో ఎలా సాధ్యమవుతుంది? ' అని గాలి ముద్దు కృష్ణమనాయుడు ప్రశ్నించారు.

ఇండియాలో ఆన్ లైన్ లావాదేవీలు కేవలం 2 శాతం మాత్రమే జరుగుతున్నాయని అన్నారు.
ప్రపంచంలోని పలు దేశాల్లో ఆన్ లైన్ లావాదేవీలు ఎంత శాతం మేరకు జరుగుతున్నాయో ఆ వివరాలను ఆయన ప్రస్తావించారు. అమెరికాలో 45 శాతం మేరకే ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతున్నాయని, మిగిలిన 55 శాతం లావాదేవీలు నగదు చెల్లింపుల ద్వారానే జరుగుతున్నాయన్నారు.

మన దేశంలో నగదు లావాదేవీలు 98 శాతం వరకు నడుస్తున్నాయని, మన దేశంలో వందశాతం అక్షరాస్యత లేదని, ఈ విషయంలో మిగిలిన దేశాలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. మనదేశంలో ముప్ఫై కిలోమీటర్ల దూరం వెళితే గానీ పాఠశాల, ఆసుపత్రి, బ్యాంకులకు వెళ్లలేని పరిస్థితులు ఉన్న ప్రాంతాలు ఉన్నాయన్నారు. దేశంలో నల్లధనం ఉన్నవాళ్లు, అవినీతిపరులు రెండు శాతం మేరకే ఉంటారని వారి కోసం 98 శాతం ప్రజలను ఇబ్బంది పెట్టడం సబబు కాదని గాలి ముద్దుకృష్ణమ అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP leaders Bonda Uma and Gali Muddu Krishnama Naidu fired at BJP for IT bill.
Please Wait while comments are loading...