బీటెక్ రవితో బ్రదర్ అనిల్ భేటీ - కడపలో మారుతున్న లెక్కలు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ లో ఎంట్రీ వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ నేతగా ఏపీలో కీలక పాత్ర పోషిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇటు టీడీపీ, జనసేన పొత్తు వేళ బీజేపీ వీరితో కలుస్తుందా లేదా అనే డైలమా కొనసాగుతోంది. ఇదే సమయంలో జగన్ అభ్యర్దులను వరుసగా ఖరారు చేస్తున్నారు. ఈ సమయంలోనే కడప రాజకీయం లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
భేటీపై ఆసక్తి : వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులు ఇడుపుల పాయకు వచ్చారు.షర్మిల తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ సమాధిని సందర్శించారు. కుమారుడి వివాహ మొదటి పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాత్రి ఇడుపులపాయలోనే బస చేసిన షర్మిల ఈరోజు విజయవాడకు రానున్నారు.ముందుగా బ్రదర్ అనిల్ కుమార్ కడప నుంచి విజయవాడకు బయల్దేరారు. ఆ సమయంలో కడప విమానాశ్రయంలో బ్రదర్ అనిల్ తో టీడీపీ నేతలు బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి తో సమావేశం జరిగింది. ఇది మర్యాదపూర్వక భేటీగా బీటెక్ రవి సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

కొత్త రాజకీయం : ఈ భేటీ సమయంలో రాజకీయ అంశాల పైనా చర్చ జరిగిందని వెల్లడించారు. కాంగ్రెస్ లో చేరుతున్న వేళ బ్రదర్ అనిల్ కు రవి కంగ్రాట్స్ చెప్పారు. బీటెక్ రవి పులివెందులలో సీఎం జగన్ పైన పోటీకి సిద్దం అవుతున్నారు. కడప లోక్ సభ నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతను బరిలోకి దింపాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరటం ద్వారా షర్మిల లేదా సునీత కడప లోక్ సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కొత్త పొత్తుల లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఈ సమయంలోనే ఈ తరహా భేటీలు కడప రాజకీయంలో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఏం జరుగుతోంది : ఇటు షర్మిల తాడేపల్లిలో తన అన్న జగన్ ను కలవనున్నారు. వీరిద్దరి భేటిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి కార్డు ఇచ్చిన తరువాత.. షర్మిళ కాంగ్రెస్ లోకివెళ్లే విషయం, ప్రస్తు త రాజకీయపరిణామాలపై ఇరువురి మధ్య చర్చలు జరుగతాయని సమాచారం. షర్మిళ రాత్రికి ఢిల్లీ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రేపు కాంగ్రెస్ లో చేరిన తరువాత ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా తన పాత్ర ఏంటనేది షర్మిల స్పష్టం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications