AP Cabinet: చంద్రబాబు కేబినెట్ మంత్రుల సగటు వయసెంతో తెలుసా ?
ఏపీలో నిన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ మంత్రులకు శాఖల కేటాయింపు చేయనున్నారు. అయితే ఈసారి సీనియర్లను కాదని ఎవరూ ఊహించని విధంగా 17 మంది కొత్త మంత్రులను తన కేబినెట్ లోకి తీసుకుని చంద్రబాబు సంచలనం సృష్టించారు. అయితే వీరి సగటు వయస్సు 55 సంవత్సరాలు కావడం విశేషం.
చంద్రబాబు కేబినెట్ లో అత్యంత పెద్ద వయస్కుడిగా 74 ఏళ్ల టీడీపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నిలిచారు. నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫరూక్ ఇప్పుడు కేబినెట్ లో చంద్రబాబు తర్వాత పెద్దాయనగా నిలవబోతున్నారు. అలాగే విజయనగరం జిల్లా గజపతినగరం నుంచి తొలిసారి ఎన్నికైన కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కుడిగా నిలవబోతున్నారు. తొలిసారి గెలిచి మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ వయసు 40 ఏళ్లు.

మిగతా మంత్రుల విషయానికొస్తే.. చంద్రబాబు కేబినెట్లోకి తీసుకున్న వారిలో అత్యధికంగా 13 మంది 50 నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఉన్నారు. వీరిలో పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పార్ధసారధి, బాల వీరాంజయనేయ స్వామి, గొట్టిపాటి రవి, గుమ్మడి సంధ్యారాణి, సవిత ఉన్నారు.
50 ఏళ్ల లోపు వయసున్న వారిలో నారా లోకేష్, టీజీ భరత్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. అలాగే 60 ఏళ్లపైన వయసున్న వారిలో నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేష్ వంటి ఉన్నారు. 70 ఏళ్లకు పైబడిన మంత్రుల్లో ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ ఉన్నారు. వీరంతా వయసుతో సంబంధం లేకుండా చంద్రబాబుతో పాటు పరుగులు తీయక తప్పని పరిస్ధితి.












Click it and Unblock the Notifications