Analysis: నామినేటెడ్ పోస్టుల భర్తీలో చంద్రబాబు లెక్కలివే..!
ఏపీలో కూటమి పార్టీల నేతలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా ఇవాళ విడుదలైంది. ఈ జాబితాను గమనిస్తే ఆయా పోస్టులకు నేతల ఎంపికలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.అలాగే ప్రభుత్వంపై సానుకూల ముద్ర పడేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు సొంత పార్టీతో పాటు మిత్రపక్షాల్ని కూడా సంతృప్తి పరిచేందుకు శతవిథాలా ప్రయత్నించినట్లు అర్థమవుతోంది.
ముందుగా సలహాదారు పోస్టులకు ఎంపిక చేసిన ఇద్దరిలో ఒకరు పార్టీ నేత మొహమ్మద్ షరీఫ్ కాగా, మరొకరు ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు. వీరిలో షరీఫ్ గత ప్రభుత్వంలో మండలి ఛైర్మన్ గా పనిచేస్తూ అమరావతి స్ధానంలో వైసీపీ సర్కార్ తెచ్చిన మూడు బిల్లుల్ని మండలిలో అడ్డుకున్న రికార్డు లిఖించుకున్నారు. ఆ తర్వాత రిటైర్ అయిన షరీఫ్ కు కూటమి సర్కార్ నామినేటెడ్ పోస్టుల తొలి జాబితాలో స్ధానం కల్పిస్తుందని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు సలహాదారు పదవి దక్కింది. అలాగే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్ధుల నైతిక విలువలపై సలహాదారు పదవి ఇవ్వడం వెనుక బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవాళ ప్రకటించిన 59 పోస్టుల్లో 10 పోస్టుల్ని మిత్రపక్షం జనసేనకు, మరో 3 పోస్టుల్ని మరో మిత్రపక్షం బీజేపీకి కేటాయించారు. ఇలా జనసేనకు కేటాయించిన పోస్టుల్లో ఆ పార్టీ పంపిన లిస్ట్ ప్రకారమే ఉన్నా.. వారంతా జనసేనలో ఆరంభం నుంచి పనిచేస్తున్న వారు లేక పార్టీకి విధేయులుగా ఉన్న వారే ఉన్నారు. ఇందులో పాలవలస యశస్వి, చిలకలపూడి పాపారావు, చిల్లపల్లి శ్రీనివాసరావు, రెడ్డి అప్పలనాయుడు, టీసీ వరుణ్, తుమ్మల రామస్వామి, కోరికన రవికుమార్, కనకరాజు సూరి, కొత్తపల్లి సుబ్బారాయుడు, డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి పూర్తి కొత్త ముఖాలు గాయత్రి, మట్టా ప్రసాద్, సురేశ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.
ఇక టీడీపీ నేతల్ని చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో బయట, టీవీల్లో గట్టిగా వాయిస్ వినిపించి ఇబ్బందులు పడ్డ వారు, సుదీర్ఘ కాలంగా పార్టీకి విధేయులుగా ఉన్న వారు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసిన వారు, ఎమ్మెల్యే సీట్లు దక్కని వారు, వైసీపీ నుంచి వచ్చి గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేసిన వారు ఇలా చాలా మందే ఉన్నారు. అలాగే కుల సమీకరణాలను, ప్రాంతీయ సమీకరణాలను, రాజకీయ సమీకరణాలను, మిత్రధర్మాన్ని పాటిస్తూ చంద్రబాబు ఈ జాబితా కూర్పు చేసినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications