నారాయణ అరెస్ట్- టెన్త్ ఫెయిల్యూర్ కప్పిపుచ్చేందుకేనన్న చంద్రబాబు- చేతకానితనమన్న లోకేష్
ఏపీలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్ధల అధినేత పొందూరు నారాయణ అరెస్టు రాజకీయంగా కలకలం రేపుతోంది. నారాయణ అరెస్టుపై ఆయన సొంత పార్టీ టీడీపీ తీవ్రంగా మండిపడింది. నారాయణ అరెస్టును కక్షసాధింపు చర్యగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. వైసీపీ సర్కార్ పదో తరగతి పరీక్షల్లో లీకేజీల తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తమ వైఫల్యానికి కప్పి పుచ్చుకునేందుకే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. నారాయణ అరెస్టు పూర్తిగా కక్షపూరితమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల నిర్వహణలో విఫలమైన వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొందన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసి ఆయనను దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండి పడ్డారు.

అసలు టెన్త్ పరీక్ష పేపర్ లీక్ అనేదే లేదంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చెయ్యలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. మాస్ కాపీయింగ్ కు, పరీక్ష ల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. అరెస్టుకు సరైన ఆధారాలు కూడా చూపించలేక పోయారని చంద్రబాబు అన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా...విచారణ చెయ్యకుండా నేరుగా అరెస్టు చెయ్యడం కక్ష పూరిత చర్య కాదా అని ప్రశ్నించారు. నారాయణను జైల్లో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అక్రమ కేసులతో జగన్ చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. లీకేజే పేరుతో నారాయణ ను అరెస్టు చెయ్యడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండిచారు.
మరోవైపు నారాయణ అరెస్టును టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ కూడా ఖండిచారు. గతంలో నారాయణతో కలిసి మంత్రిగా పనిచేసిన లోకేష్.. ఇవాళ జరిగిన ఘటనలపై స్పందించారు. చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చెయ్యడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్ అంచూ విరుచుకుపడ్డారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సిఎం జగన్ రెడ్డి గారి విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూసారని లోకేష్ గుర్తు చేశారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి, టిడిపి నేత నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని విమర్శించారు. సంబంధం లేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేపర్ లీకేజ్ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసిపి నేతల్ని వదిలేసి టిడిపి నేతల్ని అరెస్ట్ చేయించి సైకో ఆనందం పొందొచ్చు కానీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి మేలు జరగదు సిఎం గారూ అని లోకేష్ ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications