సొంత ఇంటికి మార్పులు: అద్దె ఇంట్లోకి చంద్రబాబు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్దె ఇంటి వేటలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిని కూల్చి దాని స్థానంలో భారీ భవంతిని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అది పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. అంతవరకు కుటుంబ సమేతంగా నివసించడానికి ఓ అద్దె ఇంటి కోసం ఆయన అన్వేషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
వాస్తు, భద్రత వంటి విషయాల్లో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల అభిప్రాయం కూడా ముఖ్యం కావడంతో గత పదిహేను రోజులుగా జరుగుతున్న ఇంటి అన్వేషణ ఓ కొలిక్కి రాలేదని అంటున్నారు. ఎట్టకేలకు జూబ్లీహిల్స్ రోడ్ నం. 24లో ఉన్న భవనం దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన తర్వాత వాస్తుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్, క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్న లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లలో అనేక మార్పుచేర్పులు చేశారు. ఇలా బయటి కార్యక్రమాలు పూర్తి చేసిన ఆయన ఇప్పుడు ఇంటిపై దృష్టి పెట్టారు. ఈ ఇంటిని చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పరిశీలించి అవసరమైన మార్పుచేర్పులు సూచించారు.
కాగా, విజయవాడలో కూడా ఆయన ఓ ఇంటి కోసం అన్వేషించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, అదేమైందనేది తెలియదు. రాజధానిని తాత్కాలికంగా విజయవాడకు మార్చాలనే ఆలోచనలో భాగంగా ఆయన ఆ ప్రయత్నాలు సాగించినట్లు తెలుస్తోంది. అయితే, తాత్కాలికంగా రాజధానిని విజయవాడకు మార్చే ఆలోచనను ఆయన పక్కన పెట్టారని అంటున్నారు.












Click it and Unblock the Notifications