ఏపీ ఎన్నికలకు తెలంగాణా కాంగ్రెస్ స్పూర్తితో కొత్త గేమ్ మొదలెట్టిన చంద్రబాబు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి అధికారంలోకి రావాలని, వైసిపిని గద్దె దించాలని టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసిపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండోసారి మళ్లీ అధికారంలోకి రావాలని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ప్రచార గీతాలను రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్న ఏపీ పొలిటికల్ పార్టీలు ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టడానికి వ్యూహాలను రచిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలకు వెళ్లే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను ఉదాహరణగా తీసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంతో, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారని గుర్తించిన వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వేల ఆధారంగా, వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నో అనేసారు. ఆ స్థానాలలో కొత్త అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు.
జగన్ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ పై ఫోకస్ చేసి ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తుంటే టిడిపి జనసేనలు కొత్త ఎత్తుగడతో ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో వైసిపి ఇస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజేసేందుకు వీడియోలను తయారు చేయించి ప్రజాక్షేత్రంలోకి వదులుతున్నాయి.
తమ గురించి పాజిటివ్ పబ్లిసిటీని పక్కనపెట్టి, వైసిపి గురించి నెగటివ్ పబ్లిసిటీని ఎక్కువగా చేస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కారుకు పంచర్ అయిందని, కారు రిపేరుకు వచ్చిందని, ఎక్కడికి వెళ్ళినా కెసిఆర్ కు ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని అనేక వీడియోలను చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
ఈ ప్రయత్నం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సత్ఫలితాలను ఇచ్చిందన్న భావనతో ఏపీలో టీడీపీ వైసిపి వ్యతిరేక ప్రచారంపై ఫుల్ గా ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వైసిపికి సంబంధించి నెగటివ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. టిడిపి చేస్తున్న ఈ ప్రయత్నం, చంద్రబాబు మొదలెట్టిన ఈ కొత్త గేమ్ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుంది అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications