TTD: టీటీడీ ఛైర్మన్ గా - చంద్రబాబు మార్క్ ఎంపిక..!!
Tirumala: ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్ ఎంపిక దాదాపు పూర్తయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఈ పదవి ఎవరికి దక్కుతుందనే దాని పైన పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. బోర్డు కూర్పుకు మరింత సమయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. టీటీడీ నుంచే పాలనా పరంగా ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన చంద్రబాబు ఛైర్మన్ నియామకం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు కసరత్తు
టీటీడీ అధికారులను చంద్రబాబు ఏరికోరి నియామకం చేసారు. ఈవోగా శ్యామలరావు, అదనపు జేఈవోగా కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి వచ్చిన వెంకయ్య చౌదరిని నియమించారు. గత అయిదేళ్ల కాలంలో టీటీడీ లో జరిగిన నిర్ణయాలు,ఆరోపణల పైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో టీటీడీ ఛైర్మన్ నియామకం పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వివాదాలకు అవకాశం లేకుండా ఛైర్మన్ ఎంపిక చేయాలని భావిస్తున్నారు. తొలుత అశోక్ గజపతి రాజు పేరు ప్రచారంలోకి వచ్చినా..ఆయన సుముఖంగా లేకపోవటంతో కొత్తగా ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

రేసులో ఉన్నదెవరు
పార్టీకి అన్నిసమయాల్లో అండగా నిలిచిన ఒక మీడియా సంస్థ అధినేత కు అవకాశం ఇవ్వనున్నారని పార్టీలో ప్రచారం సాగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. అదే సమయంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే సినీ ప్రముఖు నిర్మాత పేరు తెర మీదకు వచ్చింది. గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్ గా దర్శకుడు రాఘవేంద్రరావు పని చేసారు. దీంతో, ఈ నిర్మాతకు అవకాశం దక్కుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మరో పేరు పరిశీలనలోకి వచ్చిందని చెబుతున్నారు.
తుది ఎంపిక
ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు గురించి పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయంలో వేమిరెడ్డికి అధికారంలోకి రాగానే ప్రాధాన్యత కలిగిన పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గతంలో వైసీపీ హయాంలో వేమిరెడ్డి ప్రశాంతి టీటీడీ బోర్డు సభ్యురాలిగా వ్యవహరించారు. ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ఎక్కువగా పాల్గొంటారు. అయితే, టీటీడీ ఛైర్మన్ పదవి కోసం పార్టీ నుంచి ఒత్తిడి కనిపిస్తోంది. ఇద్దరు చంద్రబాబుతో చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్న నేతలు ఈ పదవి ఆశిస్తున్నారు. దీంతో, చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications